బెంగళూరు: ఈ ఏడాది ఐపీఎల్లో తమ తొలి ఐపీఎల్ టైటిల్ సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. ఆ జట్టు విజయయాత్రలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలిసారిగా స్పందించాడు. ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత సంతోషకరమైన క్షణాల్లో విషాదం అలుముకుందని రన్మిషీన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆర్సీబీ విడుదల చేసిన ఒక ప్రకటనలో విరాట్ స్పందిస్తూ& ‘జూన్ 4 హృదయ విదారక ఘటన. ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత విజయవంతమైన (ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడం) క్షణాలు కాస్తా విషాదమయ్యాయి. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, గాయపడిన వారికోసం మేం ఇప్పటికీ ఆలోచిస్తున్నాం. వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. మీ నష్టం ఇప్పుడు మాలో భాగం. ఇకనుంచి మరింత జాగ్రత్తగా, గౌరవంగా, బాధ్యతగా ముందుకుసాగుతాం’ అని తెలిపాడు. కాగా చిన్నస్వామి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉండేందుకు గాను ఇటీవలే ఆ ఫ్రాంచైజీ ‘ఆర్సీబీ కేర్స్’ను ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించనుంది.