Virat kohli | భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat kohli )టెస్ట్ క్రికెట్లో రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో(Test cricket) రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడన్న ఊహాగానాలకు తెరదించాడు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీని టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు 37 ఏళ్ల కోహ్లీ స్పందిస్తూ తాను ఆ ఫార్మాట్‌కు పూర్తిగా స్వస్తి పలికానని, ఇక తిరిగి రానని స్పష్టం చేశాడు. అదంతా గతం అని కుండబద్ధలు కొట్టారు. ఐపీఎల్ సందర్భంగా కండరాల గాయానికి గురికావడంతో విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. సోమవారం బెంగళూ రులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లో ఫిట్నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు.
ఈ గాయం కారణంగానే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు అతను దూరమైన విషయం తెలిసిందే. కాగా, గతేడాది మేలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కింగ్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్టు క్రికెట్ కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోర్ 254 నాటౌట్. భారత టెస్టు చరిత్రలో అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.