ఢిల్లీ: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 14 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతాకు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్క్రిష్ రఘువంశీ (32 బంతుల్లో 44, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 36, 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 190/9 పరిమితమైంది. డుప్లెసిస్(62), అక్షర్‌పటేల్(43)రాణించారు. నరైన్(3/29), వరుణ్ చక్రవర్తి(2/39)..ఢిల్లీ పతనాన్ని శాసించారు.
భారీ ఛేదనలో ఢిల్లీకి ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది. అనుకుల్ బౌలింగ్‌లో పొరెల్ (4) మిడాఫ్ వద్ద రసెల్ చేతికి చిక్కాడు. కరుణ్ నాయర్ (15), కేఎల్ రాహుల్ (7) కూడా నిరాశపరిచారు. కానీ డుప్లెసిస్ ధాటిగా ఆడాడు. మూడు బౌండరీలతో హర్షిత్‌కు స్వాగతం పలికిన డుప్లెసిస్.. వరుణ్ 8వ ఓవర్లో 4, 4, 6 దంచాడు. డుప్లెసిస్‌కు అక్షర్ జతకలవడంతో ఢిల్లీ స్కోరు వేగం ఊపందుకుంది. 31 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న డుప్లెసిస్.. అదే జోరును కొనసాగించాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించిన ఈ ద్వయం ఓవర్‌కు పది పరుగులకు తగ్గకుండా ఆడింది. 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నరైన్ 14వ ఓవర్లో విడదీశాడు. ఒకే ఓవర్లో అక్షర్‌తో పాటు స్టబ్స్(1)ను ఔట్ చేసి కోల్‌కతాను పోటీలోకి తీసుకొచ్చాడు. అప్పటి వరకు లక్ష్యం వైపు సాఫీగా సాగిన ఢిల్లీని డుప్లెసిస్‌ను ఔట్ చేయడం నరైన్ మళ్లీ దెబ్బకొట్టాడు. ఈసారి తన వంతు అన్నట్లు వరుణ్ 18వ ఓవర్లో వరుస బంతుల్లో అశుతోష్(7), స్టార్క్(0)ను ఔట్ చేసి కోల్‌కతా విజయానికి బాటలు వేశాడు. ఆఖర్లో విప్రాజ్ నిగమ్(38) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడు మంత్రాన్ని జపించింది. ఢిల్లీ ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన ఆ జట్టు.. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడింది. ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా అర్ధశతకం సాధించకపోయినా ప్రత్యర్థి ఎదుట 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం విశేషం. ఓపెనింగ్ జోడీ గుర్బాజ్ (12 బంతుల్లో 26, 5 ఫోర్లు, 1 సిక్స్), నరైన్ (16 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా మెరుపులు మెరిపించి 3 ఓవర్లకే 48 రన్స్ జోడించారు. రెండో ఓవర్ వేసిన చమీర బౌలింగ్‌లో నరైన్ 6, 4, 6 బాదగా గుర్బాజ్ ఓ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 25 పరుగులొచ్చాయి.
స్టార్క్ మూడో ఓవర్లో 4, 4, 6తో రెచ్చిపోయిన గుర్బాజ్.. వికెట్ల వెనుకాల పొరెల్ డైవింగ్ క్యాచ్‌తో ఔట్ అయ్యాడు. రహానే వచ్చీ రాగానే స్టార్క్ బౌలింగ్‌లో 6, 4తో పాటు ముకేశ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు దంచేయడంతో పవర్ ప్లేలో కోల్‌కతా 79/1గా నిలచింది. కానీ నాలుగు బంతుల వ్యవధిలో నరైన్, రహానే పెవిలియన్ చేరారు. వెంకటేశ్ అయ్యర్ (7) మళ్లీ విఫలమైనా రఘువంశీతో జతకలిసిన రింకూ.. స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. విప్రాజ్ బౌలింగ్‌లో రఘువంశీ రెండు సిక్సర్లు బాదగా 15వ ఓవర్లో రింకూ రెండు బౌండరీలు, ఓ సిక్స్‌తో కుల్దీప్ను శిక్షించాడు. ఐదో వికెట్‌కు 61 రన్స్ జోడించిన ఈ జోడీ కూడా వెంటవెంటనే పెవిలియన్‌కు చేరింది. ఆఖర్లో రసెల్ మెరుపులు మెరిపించాడు.
కోల్‌కతా: 20 ఓవర్లలో 204/9 (రఘువంశీ 44, రింకూ 36, స్టార్క్ 3/43, అక్షర్ 2/27);
ఢిల్లీ: 20 ఓవర్లలో 190/9(డుప్లెసిస్ 62, అక్షర్ 43, నరైన్ 3/29, వరుణ్ 2/39)