న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ బోణీ కొట్టింది. అండర్ కార్డ్, మెయిన్ కార్డ్ ఈవెంట్లలో చక్కటి ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు ఆశించిన ఫలితాలు రాబట్టింది. ఆదివారం గ్రూప్ మ్యాచ్‌లో హైదరాబాద్ 12-5 తేడాతో బరోడా బాద్‌షాస్‌పై విజయం సాధించింది. ఆరంభ పోరులో లుథియానా లయన్స్ చేతిలో ఓడిన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో పుంజుకుని సత్తాచాటింది.
హైదరాబాద్ తరఫున పురుషుల 80 కేజీల విభాగంలో ధీరజ్ సింగ్ 5-0తో అఫ్జల్‌పై, 60 కేజీల ఈవెంట్లో నవీన్ 5-0తో మోనుపై విజయాలు సాధించారు. మహిళల 65 కేజీల విభాగంలో కీర్తన పరాజయం పాలైంది. చక్కటి ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధీరజ్, నవీన్‌ను ఫ్రాంచైజీ సీఈవో త్రినాథ్ రెడ్డి అభినందించారు. తదుపరి పోరులో మంగళవారం రోహతక్ రౌడీస్‌తో హైదరాబాద్ తలపడనుంది.