భారత బ్యాడింటన్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తూ.. కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. 44 ఏండ్ల చరిత్ర గల ఈ మెగాటోర్నీ పురుషుల విభాగంలో ఇప్పటి వరకు భారత్‌కు కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కగా.. వీరిద్దరి వీర విజృంభణతో ఈ ఒక్క దఫాలోనే రెండు మెడల్స్ ఖాయమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పీవీ సింధుకు నిరాశ ఎదురవగా..శనివారం జరుగనున్న సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నారు!
యెల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు నయా చరిత్ర లిఖించారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి అదుర్స్ అనిపించారు. తద్వారా భారత్‌కు రెండు పతకాలు ఖాయం కాగా.. శనివారం వీరిద్దరి మధ్యే పోరు జరుగనుండటంతో పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ఆటగాడు బరిలోకి దిగడం ఖాయమైపోయింది. భారీ అంచనాల మధ్య డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన ప్రపంచ ఏడో ర్యాంకర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలై నిరాశగా వెనుదిరిగింది. ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో ఇప్పటి వరకు భారత్‌కు రెండే పతకాలు దక్కగా.. ఈ సారి మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. 1983లో బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనె కాంస్యం నెగ్గగా.. గత (2019) చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ సేమ్ సీన్ రిపీట్ చేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ శ్రీకాంత్ 21-8, 21-7తో మార్క్ కాల్జో (నెదర్లాండ్స్)పై అలవోక విజయం సాధించగా.. మరో మ్యాచ్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ 21-15, 15-21, 22-20తో జా జున్ పెంగ్ (చైనా)పై పోరాడి నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ సింధు 17-21, 13-21తో ప్రపంచ నంబర్‌వన్ తై జూ యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడగా.. పురుషుల క్వార్టర్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 14-21, 12-21తో లాహ్ కీన్ యే (సింగపూర్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
ఇటీవలి కాలంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న శ్రీకాంత్.. ప్రపంచ చాంపియన్‌షిప్ ఆరంభం నుంచి అదరగొడుతున్నాడు. తొలి రౌండ్లో కాస్త కష్టపడి నెగ్గిన శ్రీకాంత్ ఆ తర్వాత ప్రత్యర్థులతో సంబంధం లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇదే జోరులో శుక్రవారం 26 నిమిషాల్లో ముగిసిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ విశ్వరూపం కనబర్చాడు. తొలి గేమ్ సగం ముగిసే సరికి 11-5తో ముందంజలో నిలిచిన శ్రీకాంత్.. అదే జోష్‌లో గేమ్‌ను ముగించాడు. రెండో గేమ్ ఆరంభంలో ప్రత్యర్థి కాస్త పోటీనిచ్చినా.. ఆ తర్వాత పోరాటాన్ని ఏకపక్షం చేస్తూ శ్రీకాంత్ వరుస పాయింట్లతో విజృంభించి సెమీస్ బెర్త్ దక్కించుకున్నాడు. గంటా 7 నిమిషాల పాటు సాగిన మరో ఉత్కంఠ పోరులో యువ ఆటగాడు లక్ష్యసేన్ పోరాడి విజయం సాధించాడు.
రెండేండ్లుగా ప్రపంచ చాంపియన్ హోదాను అనుభవిస్తున్న స్టార్ షట్లర్ సింధుకు ఈ సారి నిరాశ ఎదురైంది. వరుస విజయాలతో క్వార్టర్స్‌కు చేరిన తెలుగమ్మాయి.. ప్రపంచ నంబర్‌వన్ తై జూ యింగ్ చేతిలో పరాజయం పాలైంది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తై జూ వేగాన్ని అందుకోలేకపోయిన సింధు.. వరుస గేమ్‌ల్లో ఓడింది. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్లో తై జూ చేతిలోనే ఓడిన సింధు.. ఈ సారి ఆ పరాజయానికి బదులు తీర్చుకుంటుందేమో అనుకుంటే.. మరో పరాజయంతో ఇంటిదారి పట్టింది.
క్వార్టర్స్ పోరు చాలా కష్టంగా సాగింది. ఆఖరి గేమ్‌లో ఓటమి పాలవుతానేమోనని భయమేసింది. కానీ చివరకు అదృష్టం నావైపు నిలిచింది. మూడేండ్లుగా శ్రీకాంత్‌తో ఆడలేదు. అతడు మంచి ఆటగాడు. ఈ టోర్నీలో ప్రత్యర్థికి కనీస అవకాశం ఇవ్వకుండా చెలరేగుతున్నాడు. నేనూ బాగానే ఆడుతున్నా. ఇద్దరి మధ్య హోరాహోరీ తప్పకపోవచ్చు. చూద్దాం విజయం ఎవరిని వరిస్తుందో. -లక్ష్యసేన్
ఈ స్థాయికి చేరినందుకు ఆనందంగా ఉంది. టోర్నీ ప్రారంభం నుంచి ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నా. ఎక్కువ తప్పిదాలు చేయకుండా.. ప్రత్యర్థికి పైచేయి సాధించే చాన్స్ ఇవ్వకుండా ఏకాగ్రతతో ప్రయాణం సాగించా. – శ్రీకాంత్