కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్‌లో సంచలన విజయాలతో ఫైనల్ చేరిన భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం రన్నరప్‌తో ముగిసింది. బీడబ్ల్యూఎఫ్ నిర్వహించే టోర్నీలలో ఆరేండ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించిన అతడు.. కీలక పోరులో తడబాటుకు గురయ్యాడు. క్వాలిఫయర్ దశ నుంచి మొదలుకుని సెమీస్ దాకా తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన షట్లర్లకు షాకిచ్చిన ఈ ప్రపంచ మాజీ నెంబర్ వన్.. ఫైనల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు.
ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్.. 11-21, 9-21తో చైనా షట్లర్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ లి షెంగ్ ఫెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. వరుస గేమ్‌లలో చిత్తైన శ్రీకాంత్.. ఆరంభం నుంచే తడబడి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. 36 నిమిషాల్లోనే ఆటను ముగించిన లి షెంగ్.. మ్యాచ్ ఆసాంతం శ్రీకాంత్ చేసిన అనవసర తప్పిదాలను అందిపుచ్చుకుని వాటిని అతడికి అనుకూలంగా మలుచుకున్నాడు.
తొలి గేమ్ ఆరంభంలోనే 14-8తో లి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా శ్రీకాంత్ కాస్త పుంజుకోవడంతో దానిని 10-16కు తగ్గించాడు. కానీ లి మాత్రం దూకుడును కొనసాగిస్తూ ఆ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ ఏకపక్షంగానే సాగడంతో శ్రీకాంత్‌కు నిరాశ తప్పలేదు. ఫైనల్లో ఓడినా తన ఆట పట్ల సంతృప్తిగా ఉన్నానని, తుదిపోరులో తనకు ఆశించిన ఫలితం రాకపోయినా టోర్నీ ఆసాంతం మంచి ప్రదర్శన చేశానని మ్యాచ్ అనంతరం శ్రీకాంత్ తెలిపాడు.