ఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు (పురుషుల)కు కొత్త హెడ్‌కోచ్ వచ్చాడు. మాజీ ఫుట్‌బాలర్, ముంబైకి చెందిన ఖలీద్ జమీల్‌ను కోచ్‌గా నియమిస్తూ శుక్రవారం ఆల్ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్‌కోచ్ పదవికి ముగ్గురిని (స్టీఫెన్ కాన్స్టాంటైన్, స్టెఫన్ టార్కోవిచ్, ఖలీద్) షార్ట్ లిస్ట్ చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీ.. భారత మాజీ ఆటగాడివైపే మొగ్గుచూపింది. దీంతో 13 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘బ్లూ టైగర్స్’కు స్వదేశీ కోచ్ ఎంపికైనట్టు అయింది.
చివరిసారిగా 2011-12 సీజన్లో సవియొ మెడైర ఈ బాధ్యతలు నిర్వర్తించగా ఆ తర్వాత అవకాశం ఖలీద్కే దక్కింది. ఖలీద్.. 2017 ఐ-లీగ్‌లో ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు టైటిల్ అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ జట్టులో ఖలీద్ ప్రయాణం ఈ నెల 29 నుంచి సెంట్రల్ ఆసియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (కాఫా) నేషన్స్ కప్‌తో మొదలవనుంది.