IPL | కొన్ని రోజులుగా క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగావేలం ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైసీలు 204 మంది క్రికెటర్లను దక్కించుకున్నాయి. ఏడు జట్లు తమ కెప్టెన్లను ఎంపిక చేసుకున్నాయి. మరో మూడు తమ సారధులు ఎవరో ప్రకటించాల్సి ఉంది. ఆయా ఫ్రాంచైసీల్లో సారధ్యం వహించే సామర్థ్యం గల ప్లేయర్లు ఎవరున్నారన్న విషయమై ఓ లుక్కేద్దాం..
2021 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్స్ దాకా వెళ్లినా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. పర్సనల్‌గా పెద్దగా ప్రభావం చూపకున్నా.. ఇయాన్ మోర్గాన్.. సారధిగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అద్భుతంగా నడిపించాడు. ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న మోర్గాన్‌ను కోల్‌కతా వదిలేసుకుంది. వేలంలోనూ కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్‌ను రూ. 12.25 కోట్లు చెల్లించి మరీ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో శ్రేయాస్‌కే కెప్టెన్సీ అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకున్న సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, అజింక్య రహానె వంటి సీనియర్లతోపాటు నితీశ్ రాణా, టిమ్ సౌథీ ఉన్నా..యాజమాన్యం శ్రేయాస్ వైపే ఉన్నట్లు సమాచారం. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ దరి చేర్చిన అనుభవం శ్రేయాస్ సొంతం.
ఈ దఫా తెలివిగా ప్లేయర్లను ఎంచుకున్న జట్లలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఒకటి. కేఎల్ రాహుల్‌ను వదిలేసుకుని మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లనే రిటైన్ చేసుకుంది. దీంతో కేఎల్ రాహుల్ లక్నో సారధిగా వెళ్లాడు. మెగా వేలంలో టీంఇండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్‌ను రూ.8.25 కోట్లకు, ఇంగ్లాండ్ క్రికెటర్ జాన్ బెయిర్‌స్టోను రూ.6.75 కోట్లకు, లియామ్ లివింగ్ స్టోమ్ను రూ.11.50 కోట్లకు గెలుచుకుంది. వీరిలో శిఖర్ ధావన్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. మయాంక్‌తో సహా వీరందరూ ఓపెనర్లే. యువకుడికి కెప్టెన్సీ అప్పగించాలని భావిస్తే మాత్రం మయాంక్ వైపే మొగ్గే అవకాశం ఉంది. సీనియర్ అయితే శిఖార్ ధావన్ ముందు వరుసలో ఉంటాడు. విదేశీ క్రికెటరైతే లివింగ్ స్టోన్‌కు చాన్స్ లభించొచ్చు.
ఐపీఎల్ టోర్నీలో అత్యంత ఆసక్తికర జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముందు వరుసలో ఉంటుంది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ సీనియర్ ఆటగాళ్లు. కోహ్లీ ఇప్పటికే కెప్టెన్సీ వదులుకున్నాడు. డుప్లెసిస్ (36), దినేశ్ కార్తిక్ (37) సీనియర్లు. మ్యాక్స్వెల్కూ 33 ఏళ్లు వచ్చేశాయి. మిగతా సిరాజ్, హర్షల్ పటేల్, హసరంగ, హేజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్ మాత్రమే ఫ్యాన్స్‌కు తెలిసిన వారు. కనుక మళ్లీ కోహ్లీనే సారధ్యం వహించాలని ఆర్సీబీ కోరే చాన్స్ ఉంది. కాదంటే మ్యాక్స్‌వెల్‌కు సారధ్యం లభిస్తుందని అంచనా.