వడోదర: దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ పోరుకు వేళైంది. సీజన్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శనలతో ఫైనల్ చేరిన కర్నాటక, విదర్భ తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న విదర్భ సారథి కరుణ్ నాయర్‌ను అడ్డుకోకుంటే కర్నాటకకు తిప్పలు తప్పవు. ఈ టోర్నీలో ఇప్పటికే అతడు 752 పరుగులతో దూకుడుమీదున్నాడు.
గత ఏడు ఇన్నింగ్స్‌లలో అతడు ఏకంగా ఐదు శతకాలు, ఒక అర్ధ సెంచరీతో జోరు కొనసాగిస్తున్నాడు. నాయర్‌తో పాటు ఓపెనర్లు యశ్ రాథోడ్, ధ్రువ్ షోరే, వికెట్ కీపర్ జితేశ్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు పడిక్కల్, మయాంక్, రవిచంద్రన్, వంటి బ్యాటర్లతో కర్నాటక బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది.