Kapil Dev : ‘వీధి కుక్కలను పూర్తిగా తొలగించండి’ అంటూ ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు (Supreme Court) జారీ చేసిన ఆదేశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి క్రికెట్ లెజెండ్స్ వరకూ అందరూ వీధి శునకాలకు బాసటగా నిలుస్తున్నారు. నోరులేని ఆ జీవుల పట్ల కాసింత కనికరం చూపాలని ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ మున్సిపల్ అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలోనే జంతు ప్రేమికుడైన భారత వెటరన్ కపిల్ దేవ్ (Kapil Dev) స్ట్రీట్ డాగ్స్ పట్ల కర్కశంగా వ్యవహరించవద్దని భావోద్వేగంగా అన్నాడు.
మూగ జీవాల పట్ల ప్రేమ, జాలి చూపండి అంటూ గురువారం కపిల్ దేవ్ జంతు సంరక్షణ సంఘం ‘పెట్ఫమిలియా'(Petfamilia) తరఫున ఒక వీడియో మెసేజ్ విడుదల చేశాడు. సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం అందరూ శునకాల గురించి పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక పౌరుడిగా నేను వీధి కుక్కల పక్షాన నిలుస్తాను. శునకాలు చాలా అందమైన జంతువులు. వాటి పట్ల కర్కశంగా వ్యవహరించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
⚡️A truly proud and heartwarming moment for me us at TABPS Pets.
Seeing none other than Kapil Dev, a sporting legend admired across generations feed dogs with our Purple Tails food is incredibly special. 🐾💜 pic.twitter.com/sFxYIBvOXC
— Soumya Malani (@insharebazaar) August 14, 2025
అందుకే.. నేను మున్సిపల్ అధికారులకు ఒక విన్నపం చేస్తున్నా. దయచేసి మీరు వీధి కుక్కలను ఎక్కడికో తరమేయకండి. వాటి పట్ల జాలి చూపించి.. మంచి వసతులు ఏర్పాటు చేయండి. అంటే.. అవి తలదాచుకోవడానికి షెల్టర్ హోమ్స్ పెట్టడంతో పాటు వెటర్నరీ వైద్యులను అందుబాటులో ఉంచండి అని భావోద్వేగానికి లోనయ్యాడీ 1983 వరల్డ్ కప్ విజేత. వీధి కుక్కల సంరక్షణ గురించి కపిల్ మాట్లాడడం ఇదేమీ మొదటిసారి కాదు. 2022 నవంబర్‌లో గర్భం దాల్చిన వీధి కుక్కలను అధికారులు చంపేశారు.
ఈ సంఘటనతో చలించిపోయిన కపిల్ జంతువులను హింసించడాన్ని తప్పుబడుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన వాదనలు విన్న కోర్టు.. సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిందిగా తెలిపింది. తాజాగా ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించకూడదు అని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను కపిల్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు.