Kanpur Pitch | కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియం వేదికగా మొదలుకాబోయే టెస్టు తొలి మ్యాచ్‌కు పూర్తి భిన్నంగా సాగనుందా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేసర్లకు అనుకూలించిన చెపాక్ లాగా కాన్పూర్ పిచ్ ఉండనుందా? అంటే అవుననే అంటున్నాడు పిచ్ క్యూరేటర్ శివ్ కుమార్. కాన్పూర్‌లో సంప్రదాయ నల్లమట్టి పిచ్ బ్యాటర్లతో పాటు స్పిన్నర్లకూ స్వర్గధామంగా ఉంటుందని, ఇక్కడ ఐదు రోజులు మ్యాచ్ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. కాన్పూర్‌కు సమీపంలో ఉన్నావో పట్టణానికి ఆనుకుని ఉన్న కాళిమిట్టి చెరువు నుంచి తీసిన మట్టితో పిచ్‌ను రూపొందించినట్టు ఆయన తెలిపాడు. ఆట ఆరంభమయ్యాక రెండు సెషన్ల పాటు బంతి సీమర్లకు అనుకూలిస్తుందని, కానీ ఆ తర్వాత బ్యాటర్లు కుదురుకుంటే భారీ స్కోర్లు చేయొచ్చునని అంచనా వేశాడు. ఇక చివరి మూడు రోజులలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందని చెప్పాడు.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై టెస్టు గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించిన భారత్.. కాన్పూర్‌లోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసేందుకు చెమటోడుస్తోంది. మంగళవారం సాయంత్రమే కాన్పూర్ చేరుకున్న భారత జట్టు.. బుధవారం హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేసింది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో శ్రమించారు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. శుక్రవారం నుంచి మ్యాచ్ మొదలవుతున్న నేపథ్యంలో పిచ్ ఎలా స్పందిస్తునే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మ్యాచ్ జరుగనున్న గ్రీన్ పార్క్ స్టేడియంలో పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియంలో ప్లాస్టిక్ ప్లేట్స్, బాటిల్స్ వినియోగం తగ్గించి పేపర్ ప్లేట్స్‌ను ప్రోత్సహించనున్నట్టు యూపీసీఏ తెలిపింది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో పంత్ 731 పాయింట్లతో ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సూపర్ సెంచరీతో చెలరేగిన పంత్..తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (751) ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్‌శర్మ(716) ఐదు ర్యాంక్‌లు చేజార్చుకుని పదో ర్యాంక్‌కు పడిపోయాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్థానాలు చేజార్చుకుని 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. చెన్నై టెస్టులో అదరగొట్టిన అశ్విన్(871), బుమ్రా(854) వరుసగా టాప్-2లో ఉన్నారు.