Kane Williamson | క్రిస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సారథి కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన ఆ జట్టు నిరాశజనక ప్రదర్శనలతో గ్రూపు దశలోనే నిష్క్రమించిన నేపథ్యంలో అతడు సారథ్య పగ్గాలను వదిలేశాడు. రెండేండ్ల క్రితమే టెస్టు జట్టు సారథ్యాన్ని వదులుకున్న విలియమ్సన్.. తాజాగా వైట్‌బాల్ కెప్టెన్సీ బాధ్యతల నుంచీ వైదొలిగాడు.
సారథిగా తప్పుకున్న అతడు.. 2024-25 సీజన్లో సెంట్రల్ కాంట్రాక్టునూ వదులుకోవడం గమనార్హం. కుటుంబంతో మరింత సమయం గడిపేందుకే కాంట్రాక్టును తిరస్కరించినా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)నకు అందుబాటులో ఉంటానని అతడు వెల్లడించాడు. 2016లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విలియమ్సన్ సారథ్యంలో కివీస్ 40 టెస్టులు, 91వన్డేలు, 75 టీ20లు ఆడింది. అతడి హయాంలోనే 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరింది. 2021లో ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన డబ్ల్యూటీసీ టైటిల్ విజేతగా నిలిచింది.