గాలె: స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంకను మిడిలార్డర్ బ్యాటర్ కమిందు మెండిస్ (114) శతకంతో ఆదుకున్నాడు. కివీస్ బౌలర్ రూర్కీ (3/54) ధాటికి ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన లంకేయులు.. కమిందుతో పాటు కుశాల్ మెండిస్ (50) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేశారు. మాథ్యూస్ (36), చండిమాల్ (30) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. కివీస్ స్పిన్నర్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా టిమ్ సౌథీ, అజాజ్ పటేల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.