హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ‘దేశ గౌరవాన్ని పెంచావు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావు’ అని క్రికెటర్ గొంగడి త్రిషను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. అండర్ 19 టీ20 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా త్రిశ రికార్డ్ సాధించి ఎంతోమంది మహిళలకు, మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరికొన్నాళ్లలో టీమ్ఇండియా మహిళా క్రికెట్లో అడుగుపెట్టాలని, భారత కెప్టెన్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయిలో త్రిష సత్తాచాటడం మనందరికీ గర్వకారణమని ప్రశంసిస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.