సమ్కోవో(బల్గేరియా) : అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ కాజల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల 72కిలోల సెమీస్ పోరులో కాజల్ 13-6తో జాస్మైన్ డోలెరస్(అమెరికా)పై అలవోక విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లోనూ కైర్కుల్ షర్శ్బయేవా(కిర్గిస్థాన్)ను 7-0తో కాజల్ చిత్తు చేసింది.
బౌట్ బౌట్‌కు తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోయిన కాజల్ టోర్నీలో కనీసం రజతం ఖాయం చేసుకుంది. మహిళల 50కిలోల సెమీస్‌లో శృతి.. రీనా ఓగావ(జపాన్) చేతిలో ఓడి కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. 53కిలోల సెమీస్ పోరులో సారిక..అనస్తియా పోల్సా (ఉక్రెయిన్)పై ఓడి కాంస్యం కోసం బరిలోకి దిగనుంది.