కబడ్డీ ఆట ఆడుతూ ప్రాణం కోల్పోయాడో యువకుడు. కూతకు వెళ్లి తన జట్టు కోసం రెండు పాయింట్లు తీసుకొచ్చే క్రమంలోనే అతడి శ్వాస ఆగింది. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని సేలం జిల్లా మనడికుప్పుం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికంగా జరిగిన కబడ్డీ పోటీలలో భాగంగా విమల్రాజ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకెళ్తే.. మనడికుప్పంలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో భాగంగా విమల్రాజ్ కూతకు వెళ్లాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అతడిని పట్టుకోబోగా అతడు వాళ్లమీద నుంచి ఎగిరి బార్డర్ లైన్ దగ్గర వచ్చి పడ్డాడు. ఈ క్రమంలో మరో ప్లేయర్ అతడిని అడ్డుకోబోతుండగా అతడి మోకాలు.. విమల్రాజ్ ఛాతిలో బలంగా తాకింది.
అయితే అప్పటికే విమల్రాజ్ లైన్ను తాకడంతో రిఫరీ అతడికి రెండు పాయింట్లు ఇస్తూ విజిల్ వేశాడు. మరోవైపు విమల్రాజ్ కిందపడ్డచోటు నుంచి మెల్లిగా లేస్తూనే అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అతడి జట్టు ఆటగాళ్లు, మ్యాచ్ రిఫరీ వచ్చి అతడిని లేపేందుకు ప్రయత్నించినా విమల్రాజ్ మాత్రం అచేతనంగా పడిపోయాడు. తర్వాత అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఇదిలాఉండగా విమల్రాజ్ ఛాతిమీద మోకాలుతో నొక్కిన ప్రత్యర్థి జట్టు ఆటగాడు ఆటలో భాగంగా అలా చేశాడా..? లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా..? అనే కోణంలో పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విమల్రాజ్ కబడ్డీ ఆడుతూ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం రేపింది.