న్యూఢిల్లీ: తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ రెండు వారాల వ్యవధిలో మూడోసారి జాతీయ రికార్డు బద్దలు కొట్టింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాసింది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న అథ్లెటిక్స్ మీట్ 100 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో 22 ఏండ్ల జ్యోతి 13.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరి భళా అనిపించుకుంది. గత ఆదివారం యూకే వేదికగా జరిగిన లౌఫ్బరౌఫ్ అంతర్జాతీయ టోర్నీలో జ్యోతి 13.11 సెకన్లలో లక్ష్యాన్ని చేరి జాతీయ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 2002లో అనురాధ బిస్వాల్ (13.38 సెకండ్లు) నెలకొల్పిన రికార్డును ఈ నెలలో జ్యోతి మూడు సార్లు సవరించడం విశేషం. భువనేశ్వర్‌లోని అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో జెమ్స్ హిల్లిర్ వద్ద శిక్షణ పొందుతున్న జ్యోతి.. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నది. ఇక ఇదే టోర్నీలో భారత్‌కు చెందిన సిద్ధాంత్ పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో 14.42 సెకన్లలో గమ్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు.