ఢిల్లీ : భారత యువ జుడోకా ఇనుంగాంబి తఖెల్లంబం చరిత్ర సృష్టించింది. ఆసియా జూడో చాంపియన్షిప్లో 13 ఏండ్లుగా ఊరిస్తున్న పతకాన్ని ఆమె సాధించింది. చైనాలోని ఒర్డస్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం ముగిసిన మహిళల 70 కిలోల కాంస్య పోరులో తఖెల్లంబం.. సరంత్సెత్సెగ్ (మంగోలియా)ను ఓడించి పతకం నెగ్గింది.
తద్వారా 2013 తర్వాత ఈ టోర్నీ (అంగోమ్ అనితా ఛానుకు మెడల్)లో భారత్కు పతకం సాధించిన తొలి జుడోకాగా నిలిచింది. మొత్తానికి ఈ టోర్నీలో భారత్కు ఇది 16వ పతకం. తొలి రౌండ్ బై దక్కడంతో నేరుగా క్వార్టర్స్ ఆడిన తఖెల్లెంబం.. ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ షిరింజన్ చేతిలో ఓడినా రెపిఛేజ్ రౌండ్లో మాల్డొకులొవ (కిర్గిస్థాన్)ను ఓడించి కాంస్య పోరుకు అర్హత సాధించింది.