ఢిల్లీ : ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా నిబంధనలను ఉల్లంఘించి డగౌట్లో ఫోన్ వాడినందుకు గాను రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్‌కు బీసీసీఐ లక్ష రూపాయల జరిమానా విధించింది. గతవారం గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా భిందర్.. డగౌట్లో ఫోన్ వాడుతూ కనిపించాడు. అతడి పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని రోమికి బీసీసీఐ షోకాజ్ నోటీసులను జారీ చేయగా అతడిచ్చిన వివరణపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అతడిది మొదటి తప్పుగా భావిస్తూ జరిమానాతో సరిపెట్టినట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపాడు. ఇది పునరావృతమైతే భవిష్యత్‌లో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం జట్టు మేనేజర్లు, మీడియా మేనేజర్లు, డ్రెస్సింగ్ రూమ్ లోపల ఫోన్ వాడొచ్చు గానీ డగౌట్ ఏరియాలోకి మాత్రం అందుకు అనుమతి లేదు.