Jonathan Trott | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 15న న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ గుర్తుందా…! ప్రపంచ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నేలకు దించుతూ.. అఫ్గానిస్థాన్ దుమ్మురేపితే.. డగౌట్‌లోని ఓ వ్యక్తి మాత్రం ఆ విజయం తనదే అన్నంతగా సంబరపడిపోతూ కనిపించాడు. ఆటగాళ్ల కంటే ఎక్కువ సంబురాలు చేసుకుంటూ.. ఆ గెలుపును పరిపూర్ణంగా ఆస్వాదించాడు. అతడెవరో కాదు.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జొనాథన్ ట్రాట్!
ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ముగ్గురు మాజీ చాంపియన్ల (ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకను)ను ఓడించడం వెనుక ట్రాట్ పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న ట్రాట్ ఆ జట్టును ఓ పర్ఫెక్ట్ ప్యాకేజ్‌గా తీర్చిదిద్దాడు. గతంలో అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే.. కేవలం రషీద్, నబీ, ముజీబ్‌ను కాచుకుంటే సరిపోతుంది.. బ్యాటింగ్‌లో వాళ్లకు అంత సీన్ లేదని అనుకునే వారు.. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. ఎంత పెద్ద జట్టుపై అయినా తాము సమిష్టిగా సత్తాచాటగలమని కాబూలీలు నిరూపించుకున్నారు.
బౌలింగ్‌లో స్పిన్నర్లు సత్తాచాటుతుంటే.. బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది, అజ్మతుత్లా ఒమర్జాయ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. పాకిస్థాన్, శ్రీలంకపై విజయాల్లో ఆఫ్ఘన్ బౌలర్ల కంటే.. బ్యాటర్లే ప్రముఖ పాత్ర పోషించారు. అయితే దీని వెనుక ఇంగ్లండ్ మాస్టర్ మైండ్ ట్రాట్ కోచింగ్ పాత్ర చాలా ఉంది. ఏ ఆటగాడికి ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించాలి.. ఎవరి కర్తవ్యం ఏంటి అని చక్కగా ప్లేయర్లకు బోధిస్తున్న ట్రాట్ లంకపై మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తమ ప్లేయర్లు కూడా సెంచరీలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.
‘వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటికే చాలా సెంచరీలు నమోదయ్యాయి. కానీ మా ప్లేయర్లు ఇప్పటి వరకు శతకం నమోదు చేయలేదు. ఇక మా తదుపరి టార్గెట్ అదే. ఎక్కువ సమయం క్రీజులో గడపడం ముఖ్యం. అదే సమయంలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని పెద్ద ఇన్నింగ్స్ ఆడితే.. జట్టుకు మరింత మేలు చేకూరుతుంది. మా ప్లేయర్లు వంద పరుగుల మార్క్ అందుకుంటారనే నమ్మకం నాకుంది. వారిలో ఆ సత్తా ఉంది’ అని ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్ చెప్పారు.