Joe Root : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (Joe Root) మరో ఘనత సాధించాడు. బ్రిటీష్ ఎంపైర్ ఆర్డర్ (MBE)లో సభ్యుడిగా అరుదైన గౌరవం అందుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు విశేషమైన సేవలందించినందుకు రూట్ ఈ హోదాకు ఎంపికయ్యాడు. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన రాణి అన్నె (Princess Anne) అతడికి ఈ విశేషమైన గౌరవం కట్టబెట్టింది.
బుధవారం జూన్ 12న విండ్సర్ క్యాస్లేలో కన్నులపండువగా జరిగిన వేడుకలో రూట్ ఇంగ్లండ్ రాజముద్ర ఉన్న కానుకను స్వీకరించాడు. అనంతరం భార్య కారీ కాటెరెల్ (Carrie Catterell)తో కలిసి కెమెరాకు ఫోజులిచ్చాడు.
ప్రపంచంలోనే గొప్ప టెస్టు క్రికెటర్ అయిన రూట్.. 2012లో భారత్‌పై అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. అనతికాలంలోనే ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌లతో ఫాబ్ 4లో ఒకడిగా ఎదిగాడు. సుదీర్ఘ ఫార్మాట్లో చాపకింద నీరులా పరుగుల వరద పారించే ఈ స్టార్ ఆటగాడు సెంచరీలమీద సెంచరీలు బాదాడు.
ఇంగ్లండ్ మాజీ సారథి అయిన రూట్ తన 12 ఏండ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు తన పేరిట రాసుకున్నాడు. ఇప్పటివరకూ అతడు 140 టెస్టులు, 171 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాటల్లో కలిపి 19,151 పరుగులు సాధించాడు. అంతేకాదు భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా రూట్ రికార్డు నెలకొల్పాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను దాటేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.