హైదరాబాద్ ఆట ప్రతినిధి: హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ పి. నవీన్ రావు పర్యవేక్షణ ఉన్నప్పటికీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆఫీస్ బేరర్లు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి విమర్శించారు. హెచ్‌సీఏ కార్యదర్శిగా ఎం. జీవన్‌రెడ్డి దొడ్డి దారిలోఎన్నికయ్యారని ఆరోపించారు.
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆక్స్ఫర్డ్ బ్లూస్ క్లబ్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకే పేరుతో రెండు సొసైటీలు విడివిడిగా నమోదైందని తెలిపారు. గతేడాది నవంబర్‌లో ఈ క్లబ్‌ను కొనుగోలు చేసిన జీవన్‌రెడ్డి నాలుగు నెలల కాలంలోనే కార్యదర్శిగా ఎన్నికవడం వెనుక ఫోర్జరీ, మాల్‌ప్రాక్టీస్ జరిగిందని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గురువారెడ్డి ఆరోపించారు.
ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఫోన్లు వచ్చాయని హెచ్‌సీఏ సభ్యులు బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు. ఇక ఏజీఎం ఆమోదం లేకుండా టీజీ20 లీగ్‌ను ప్రకటించారని, ఈ లీగ్‌లోని ఫ్రాంచైజీల విక్రయం ద్వారా దాదాపు రూ.100 కోట్ల నిధులు దారి మళ్లే అవకాశం ఉందన్నారు. నడి వేసవిలో రాష్ట్రంలోని 5 వేల మందికి హైదరాబాద్‌లో ఒకే రోజు ఓపెన్ సెలెక్షన్స్ నిర్వహించి గ్రామీణ క్రికెటర్లకు అన్యాయం చేయాలని హెచ్‌సీఏ చూస్తోందని ఆరోపించారు. టీసీఏతో కలిసి జిల్లాల్లో ట్రయల్స్ నిర్వహించాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు.