Magnus Carlsen | ఓస్లో: నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ నిరుడు వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో ధరించిన వివాదాస్పద జీన్ ప్యాంట్ ఆన్లైన్లో భారీ ధర పలికింది. ఫిడే నిబంధనల ప్రకారం ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే క్రీడాకారులు ఫార్మల్స్‌లో రావాల్సి ఉండగా కార్ల్సన్ మాత్రం జీన్స్‌లో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీంతో అతడు ఫిడే ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.
కాగా కొద్దిరోజుల క్రితం కార్ల్సన్.. ఈ జీన్స్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ‘ఈ-బే’లో విక్రయానికి ఉంచాడు. దీని ద్వారా వచ్చిన నిధులను ‘బిగ్ బ్రదర్స్, బిగ్ సిస్టర్స్’ ఎన్జీవోకు అందజేస్తానని తెలిపాడు. తాజాగా కార్ల్సన్ ఆ జీన్ ప్యాంట్‌ను ఒక వ్యక్తి రూ. 31 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడని తన ఎక్స్ ఖాతా వేదికగా తెలిపాడు.