మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Jan 12, 2020 , 02:11:35

జావీద్‌ సెంచరీ మిస్‌

జావీద్‌ సెంచరీ మిస్‌
  • హైదరాబాద్‌ 225 ఆలౌట్‌.. ఆంధ్రతో రంజీ మ్యాచ్‌

ఒంగోలు: గత మ్యాచ్‌లో కేరళను చిత్తుచేసి జోరు కనబర్చిన హైదరాబాద్‌ జట్టు.. ఆంధ్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మళ్లీ పాత పాట అందుకున్నది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో రెండో మ్యాచ్‌ ఆడుతున్న జావీద్‌ అలీ (161 బంతుల్లో 98; 16 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో మన జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (33)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అక్షత్‌ రెడ్డి (17) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోగా.. జమాల్‌పూర్‌ మల్లికార్జున్‌ (0), సీవీ మిలింద్‌ (0) సున్నాలు చుట్టారు. దీంతో హైదరాబాద్‌ 38/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో తన్మయ్‌కు జావీద్‌ తోడవడంతో ఇన్నింగ్స్‌ గాడినపడింది. హిమాలయ్‌ అగర్వాల్‌ (7), కొల్లా సుమంత్‌ (5) విఫలమయ్యారు. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. ఏ మాత్రం వెరువకుండా ధాటిగా ఆడిన జావీద్‌ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్‌ 5, ఎర్రా పృథ్వీరాజ్‌ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆంధ్ర శనివారం ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో 13/0తో నిలిచింది.

పుజారా 50వ సెంచరీ..

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలో దిగిన పుజారా (162 బ్యాటింగ్‌; 17 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ శతకంతో అదరగొట్టాడు. తద్వారా భారత్‌ నుంచి అత్యధిక ఫస్ట్‌క్లాస్‌ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. గవాస్కర్‌, సచిన్‌ చెరో 81 శతకాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంటే.. ద్రవిడ్‌ (68) మూడో స్థానంలో ఉన్నాడు. పుజారాతో పాటు జాక్సన్‌ (99) ఆకట్టుకోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 2 వికెట్లకు 296 పరుగులు చేసింది.


logo