Jasprit Bumrah | తన కుమారుడు అంగడ్ (Angad)పై విమర్శలు చేస్తున్న వారిపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) భార్య సంజనా గణేషన్ (Sanjana Ganesan) ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తన కుమారుడి గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఈ మేరకు ట్రోలర్స్‌పై విరుచుకుపడుతూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు.
ఐపీఎల్ (IPL 2025) లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు బుమ్రా భార్య సంజన గణేషన్ తన కుమారుడు అంగడ్తో కలిసి స్టేడియానికి వచ్చింది. బుమ్రా వికెట్ తీసినప్పుడు అంగడ్ గ్యాలరీలో చప్పట్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, ఆ సందర్భంగా అక్కడున్న కెమెరామెన్లు అంగడ్ను వీడియో తీశారు. మూడు సెకన్ల ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చిన్నారి అంగడ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. కొంత మంది నెటిజన్లు డిప్రెషన్, ట్రామా వంటి పదాలు వాడుతూ బుమ్రా- సంజనాలను విమర్శించారు. దీనిపై స్పందించిన సంజన.. విమర్శకులకు ధీటుగా సమాధానమిచ్చారు.
‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరును లాగొద్దు. నేను, బుమ్రా మా కుమారుడిని సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే.. ఇంటర్నెట్లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు కాబట్టి. వేల కెమెరాలతో నిండిన క్రికెట్ స్టేడియానికి మా చిన్నారిని తీసుకురావడం వల్ల కలిగే ఇబ్బందులను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ మేము బుమ్రాకు మద్దతు ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని అర్థం చేసుకోండి. మా కుమారుడు జాతీయ మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ వైరల్ అవ్వాలన్న ఆసక్తి మాకు లేదు. కేవలం 3 సెకన్ల వీడియోతోనే కొంతమంది కీబోర్డు వారియర్లు అంగడ్ గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు. మా బాబుకు ఇప్పుడు ఇంకా ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్ వంటి పెద్దపెద్ద పదాలు వాడుతూ విమర్శలు చేస్తున్నారు. మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. సమాజం ఎటు పోతుందోనని ఆందోళనగా ఉంది. ఇది నిజంగా విచారకరం. మా జీవితాల గురించి మీకు ఏమీ తెలియదు. అలాంటప్పుడు మాపై మీ సొంత అభిప్రాయాలు సరికాదు. ఎదుటి వారి పట్ల దయతో వ్యవహరించండి’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం సంజన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read..
Mumbai Indians | ముంబై పాంచ్ పటాకా.. వరుసగా ఐదో విజయం
RCB | ఆర్సీబీ టాప్ షో.. ఢిల్లీపై విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి
Asaduddin Owaisi | షాహిద్ అఫ్రిది ఓ జోకర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు..!