Bumrah ముంబై: తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ముప్పుతిప్పలు పెట్టిన టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం భారత జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. సిరీస్ ఓటమి కంటే అతడు పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు కోలుకుని తిరిగి జట్టుతో కలుస్తాడు..? అన్న దానిపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. వచ్చే నెలలో కీలకమైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది.
ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ బుమ్రా అందుబాటులో ఉండటం అనుమానమే. వెన్నునొప్పి తిరగబెట్టడం(?)తో సిడ్నీ టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న అతడి గాయం తీవ్రతపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. ఒకవేళ అతడి గాయం గ్రేడ్- 1 లెవల్లో ఉంటే బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టొచ్చు. అదే గ్రేడ్ – 2 స్థాయిలో ఉంటే ఆరు వారాలు, గ్రేడ్- 3 అయితే కనీసం మూడు నెలలు అవసరం ఉంటుంది.