ముంబై : వచ్చే నెల మొదలుకానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని దేశాలూ తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. కానీ బీసీసీఐ మాత్రం గడువు తేదీ (జనవరి 12) ముగిసినా జట్టును ప్రకటించకపోగా తమకు మరికొంత సమయం కావాలని ఐసీసీని కోరింది.
ఈనెల 18 లేదా 19న భారత జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ప్రధానంగా భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ గురించి స్పష్టమైన అవగాహన లేకపోవడంతోనే జట్టు ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వెన్ను నొప్పితో గాయపడ్డ బుమ్రా.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా? అన్నది స్పష్టత లేదు. ఇక గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న కుల్దీప్ ప్రస్తుతం ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నాడు. త్వరలోనే వీళ్ల ఫిట్నెస్ రిపోర్ట్ రానుందని, అది వచ్చిన వెంటనే జట్టును ప్రకటిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.