Jasprit Bumrah : భారత జట్టు అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వచ్చేస్తున్నాడు. ఈమధ్యే న్యూజిలాండ్‌లో సర్జరీ(Back Surgery) చేయించుకున్న ఈ స్పీడ్‌స్టర్ త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అవును.. ఆగస్టులో జరిగే ఐర్లాండ్ టూర్(Ireland Tour) కల్లా అతను ఫిట్నెస్ సాధించనున్నాడని సమాచారం. ‘కోర్సు ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే బుమ్రా పూర్తి ఫిట్నెస్తో మైదానంలోకి దిగుతాడు. ఐర్లాండ్ సిరీస్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు’ అని బీసీసీఐ(BCCI)లోని ఒక అధికారి తెలిపాడు.
భారత జట్టు ఆగస్టులో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్లు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆగస్టు 18, 20, 23వ తేదీన ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. సర్జరీ తర్వాత కోలుకుంటున్న బుమ్రా నెల క్రిత తన రన్నింగ్ షూ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. హలో నేస్తమా..! మనం మళ్లీ కలుస్తాం అని క్యాప్సన్ రాసిన ఈ పేసర్ తన రీ-ఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు.
వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రా మైదానంలోకి దిగి దాదాపు ఏడాది కావొస్తోంది. గాయం కారణంగా ఈ స్టార్ పేసర్ గత ఏడాది ఆసియా కప్(Asia Cup 2022)కు దూరమయ్యాడు. గాయం తిరబెట్టడంతో టీ20 వరల్డ్ కప్, స్వదేశంతో శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లతో పాటు ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)లో ఈ యార్కర్ కింగ్ ఆడలేదు. 2022 జూలై నుంచి అతను కేవలం రెండంటే రెండే మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభానికి ముందు వెన్నెముక సర్జరీ కోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లాడు. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు.
స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్(ODI WC 2023)లో బుమ్రా కీలకం కానున్నాడు. ఆలోపు అతను పూర్తి ఫిట్నెస్ సాధించాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న షురూ కానుంది. 2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో కప్పు కొట్టిన టీమిండియా మళ్లీ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.