న్యూఢిల్లీ: ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ చరిత్ర సృష్టించింది. మెన్స్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్స్ అయిన మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సో వుయ్ జోడీని భారత జోడీ 21-17, 21-18 తేడాతో మట్టికరిపించింది.
ఇండోనేషియా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో ఏ డబుల్స్ కాంబినేషన్‌లోనైనా భారత్ బంగారు పతకాన్ని గెలుచుకోవడం ఇదే తొలిసారి. గత కొంత కాలం నుంచి బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో నిలకడ కొనసాగిస్తున్న సాత్విక్ జోడీ.. శనివారం జరిగిన సెమీస్ తొలి గేమ్‌లో పరాజయం పాలైనా తర్వాత పుంజుకుని విజయం సాధించారు. ఇవాళ ఫైనల్లోనూ నెగ్గి భారత్‌కు బంగారు పతకం సాధించిపెట్టారు.
ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్ అంటే.. సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇలా సింగిల్స్ ప్లేయర్ల పేర్లే ఎక్కువ చర్చకు వచ్చేవి. కానీ ఇప్పుడు డబుల్స్‌లోనూ మనవాళ్లు దుమ్మురేపుతున్నారు. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడైన విజయాలతో డబుల్స్‌లోనూ పతకాలు కొల్లగొట్టగలమనే భరోసా ఇస్తున్నారు. నిరుడు బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన ఈ జోడీ.. ఇప్పుడు ఇండోనేషియా ఓపెన్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.