Jannik Sinner | షాంఘై (చైనా): ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ షాంఘై మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఫైనల్లో వరుస సెట్లలో చిత్తుచేసి ట్రోఫీని గెలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో భాగంగా ఆదివారం జరిగిన తుదిపోరులో ప్రపంచ ఒకటో నెంబర్ ర్యాంకర్ అయిన సిన్నర్.. 7-6 (7/4), 6-3తో జొకోవిచ్‌ను ఓడించాడు.
ఈ టోర్నీ గెలిచి తన కెరీర్లో వందో టూర్ టైటిల్ నెగ్గాలని భావించిన జొకోకు సిన్నర్ షాకిచ్చాడు. పురుషుల టెన్నిస్‌లో జిమ్మీ కానర్స్ (109), రోజర్ ఫెదరర్ (103) మాత్రమే ఈ ఘనత సాధించారు. వూహాన్ ఓపెన్ విజేత సబలెంక: వూహాన్ ఓపెన్‌లో బెలారస్ అమ్మాయి అరీనా సబలెంక విజేతగా నిలిచింది. ఫైనల్లో సబలెంక.. 6-3, 5-7, 6-3తో పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన చైనా ప్లేయర్ కిన్వెన్ జెంగ్‌ను ఓడించింది. ఈ ఏడాది సబలెంకకు ఇది నాలుగో టైటిల్ కావడం విశేషం.