మసొన్(యూఎస్): ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న సిన్సినాటి ఓపెన్‌లో ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ అదరగొడుతున్నాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మొదటి ర్యాంకులో ఉన్న అతడు సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో 7-6 (11/9), 5-7, 7-6 (7/4)తో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించాడు. జ్వెరెవ్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌లలో రెండు మాత్రమే నెగ్గిన సిన్నర్‌కు ఆఖరి నాలుగు సార్లూ నిరాశే ఎదురైంది. కానీ సెమీస్‌లో మాత్రం పట్టుదలగా ఆడిన అతడు ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మరో సెమీస్‌లో ఫ్రాన్సెస్ టియాఫో(అమెరికా) 4-6, 6-1, 7-6 (7/4)తో హోల్గర్ రునె (డెన్మార్క్)ను చిత్తుచేసి సిన్నర్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)ను అరీనా సబలెంక ఓడించింది.