Ranji Trophy : రంజీ ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. మేఘాలయ బ్యాటర్ ఆకాశ్ కుమార్ చౌదరి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పగా.. దేశవాళీలో పెద్ద జట్టైన ఢిల్లీపై జమ్ము కశ్మీర్ జయభేరి మోగించింది. 65 ఏళ్లలో మాజీ ఛాంపియపై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. కమ్రాన్ ఇక్బాల్(133 నాటౌట్), అకీబ్ నబీ(5-35), వన్షాజ్ శర్మ(6-68) బంతితో చెలరేగడంతో దశాబ్దాల కలను సాకారం చేసుకుంది. చిరస్మరణ విజయంతో జమ్ము టీమ్ ఎలైట్ గ్రూప్ డీలో రెండో స్థానానికి ఎగబాకింది.
రంజీ ట్రోఫీలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జమ్ము కశ్మీర్ జట్టు ఢిల్లీకి ఊహించని షాకిచ్చింది. పటిష్టమైన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జమ్ము బౌలర్లు తక్కువకే కట్టడి చేశారు. అకీబ్ నబీ(5-35), వన్షాజ్ శర్మ(6-68)లు విజృంభించి విజయానికి బాటలు వేశారు. అనంతరం 179 పరుగుల ఛేదనలో జమ్ము కశ్మీర్ ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బాల్ (133 నాటౌట్) శతకంతో కదం తొక్కాడు. క్రీజులో పాతుకుపోయిన కమ్రాన్‌ను ఔట్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీని అకీబ్ నబీ కోలుకోలేని దెబ్బ తీశాడు. టాపార్డర్ విఫలమైనా కెప్టెన్ అయుష్ బదొని(64), ఆయుష్ డొసెజా(65), సుమిత్ మథూర్(55) అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. ఆఖర్లో అకీబ్ ముష్తాక్(2-30) తిప్పేయగా ఢిల్లీ 211కే ఆలౌటయ్యింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన జమ్ము కశ్మీర్ సారథి పరాస్ డోగ్రా(106), అబ్దుల్ సమద్(85)ల మెరుపులతో మూడొందలు కొట్టింది.
2024: Defeated a star-studded Mumbai team ✅
2025: Beat Delhi for the first time ✅Auqib Nabi, Paras Dogra & Qamran Iqbal script a historic win for J&K 🙌
Scorecard: https://t.co/YIdUWmEKfz | #RanjiTrophy pic.twitter.com/soKcLZ8OgH
— ESPNcricinfo (@ESPNcricinfo) November 11, 2025
రెండో ఇన్నింగ్స్‌లోనైనా పెద్ద స్కోర్ చేయాలనుకున్న ఢిల్లీ బ్యాటర్లను వన్షాజ్ శర్మ(6-68) వికెట్ వేటతో హడలెత్తించాడు. ఆయుశ్ బదొని(72), ఆయుశ్ డొసెజ్(65)లు పోరాడినా.. మిడిలార్డర్, టెయిలెండర్లను వన్షాజ్ పెవిలియన్ పంపగా 277కే ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్ధి నిర్దేశించిన ఛేదనలో జమ్ము ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్(133 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అతడు.. 20 ఫోర్లు, 3 సిక్సర్లతో జట్టుక చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.