ITF | హైదరాబాద్, ఆట ప్రతినిధి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్-జే100 బాలికల సింగిల్స్ టైటిల్‌ను తెలంగాణ అమ్మాయి బసిరెడ్డి రిషిత రెడ్డి కైవసం చేసుకుంది. ఢిల్లీలో గత నెల 25-30 తేదీలలో జరిగిన ఈ టోర్నీలో భాగంగా ముగిసిన గర్ల్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో రిషిత.. 4-6, 6-4, 6-3తో నెల్లి ఇవానోవా (రష్యా)ను చిత్తుచేసింది.
ఈ టోర్నీ తొలి రౌండ్ నుంచి ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ ఫైనల్ చేరిన రిషిత.. తుదిపోరులో తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ తర్వాత పుంజుకుని రష్యా అమ్మాయిని ఓడించింది. ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో భాగంగా తెలంగాణలో అగ్రస్థానంలో ఉన్న రిషిత.. భారత్‌లో 3వ ర్యాంకును కలిగిఉంది. ఈ నెల 16-19 తేదీలలో జరుగబోయే ఇంటర్నేషనల్ లాన్ టెన్నిస్ క్లబ్ రాడ్ లీవర్ క్లబ్లో రిషిత భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.