US Open | న్యూయార్క్: ఇటలీ యువ సంచలనం జన్నిక్ సిన్నర్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విన్నర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గి సంచలనం సృష్టించిన సిన్నర్.. తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌నూ సొంతం చేసుకున్నాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సిన్నర్ 6-3, 6-4, 7-5తో అమెరికా కుర్రాడు టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు.
రెండు గంటలా 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో వరుస సెట్లలో ఫ్రిట్జ్‌ను చిత్తుచేసిన సిన్నర్.. నోవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ తర్వాత ఒకే ఏడాది హార్డ్ కోర్ట్స్ (ఆస్ట్రేలియా, యూఎస్)లో టైటిల్స్ గెలిచిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఫైనల్ పోరులో 29 విన్నర్లు కొట్టిన సిన్నర్.. 10 ఏస్‌లు సంధించాడు. ఫ్రిట్జ్ 6 ఏస్‌లు, 23 విన్నర్లు మాత్రమే కొట్టగలిగాడు. అద్భుత పోరాటపటిమతో ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ ఫైనల్ చేరిన ఫ్రిట్జ్.. తుదిపోరులో సొంత ప్రేక్షకుల ఎదుట మాత్రం తేలిపోయాడు.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్‌ను అల్కారజ్ గెలుచుకోగా ఆస్ట్రేలియా, యూఎస్ ఓపెన్లలో సిన్నర్ విజేతగా నిలవడం విశేషం. ఈ ఇద్దరూ 23 ఏండ్ల లోపు వారే కావడం గమనార్హం. 1993 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : గత ఏడాదికాలంగా టెన్నిస్‌లో ఇటలీ ప్లేయర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి ఇటలీకి తొలి మెన్స్ సింగిల్స్ టైటిల్ అందించిన సిన్నర్.. తాజాగా యూఎస్ ఓపెన్ సైతం గెలిచి చరిత్ర సృష్టించాడు. 2015లో ఇటలీకి చెందిన ఫ్లావియా పెన్నెట్ట తర్వాత ఆ దేశం తరఫున యూఎస్ ఓపెన్ గెలిచిన రెండో వ్యక్తిగా సిన్నర్ నిలిచాడు. సిన్నర్‌తో పాటు లొరెంజొ ముసెట్టి సైతం పురుషుల సింగిల్స్‌లో రాణిస్తున్నాడు.
మహిళల సింగిల్స్‌లో జాస్మిన్ పలోని సంచలన విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో ఆమె రన్నరప్‌గా నిలవగా యూఎస్ ఓపెన్‌లోనూ ప్రిక్వార్టర్స్ చేరింది. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో పలోని.. డబుల్స్‌లో సారా ఎర్రానితో కలిసి స్వర్ణం గెలిచింది.
ఇదే ఈవెంట్లో ముసెట్టి కాంస్యం నెగ్గాడు. ఇక యూఎస్ ఓపెన్‌కు ముందే డోపింగ్ ఆరోపణలు చుట్టుముట్టడంతో ఒకింత ఒత్తిడితోనే టైటిల్ వేటను ఆరంభించిన సిన్నర్.. ఎక్కడా ఏకాగ్రత చెదరకుండా 23 ఏండ్లకే రెండో గ్రాండ్‌స్లామ్‌ను ఒడిసిపట్టాడు. వీరి దూకుడుతో టెన్నిస్‌లో ఇటలీ ఆధిపత్యం క్రమంగా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జన్నిక్ సిన్నర్: 3,600,000 యూఎస్ డాలర్లు
రూ. 30.23 కోట్లు