బాకు(అజర్బైజాన్): అంతర్జాతీయ స్థాయి లో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్.. ప్రపంచ వేదికపై మరోసారి తళుక్కుమంది. అజర్బైజాన్ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్‌కప్‌లో ఇషాసింగ్ పసిడి పతకం కొల్లగొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో శుక్రవారం ఇషా-శివ నర్వాల్ జోడీ 16-10తో ఇలాదా తర్హాన్-యూసుఫ్ (టర్కీ) ద్వయంపై గెలిచి అగ్రస్థానం దక్కించుకుంది.
అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో ఇషా 290 పాయింట్లు శివ 293 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌తో ఫైనల్లో అడుగుపెట్టారు. తుదిపోరులోనూ అదిరిపోయే గురితో ఇషా దుమ్మురేపింది. మెగాటోర్నీలో ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో ఏడు పతకాలు దక్కించుకున్న భారత్..మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తొలి పతకం దక్కించుకోవడం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక స్వర్ణం, ఒక కాంస్యం గెలిచిన భారత్.. పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది.