ముంబై : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్పీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే జనవరి 26 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరిగే టోర్నీ కోసం గురువారం ముంబైలో ప్లేయర్ల వేలం పాట నిర్వహించారు. ఇందులో లుధియానాకు చెందిన అభిషేక్ కుమార్ దాల్హోర్ను రికార్డు స్థాయిలో 20.50లక్షలకు ముంబై మాజీ జట్టు సొంతం చేసుకుంది. లీగ్‌కు ఎంపికైన అతిపిన్న వయసు(15 ఏండ్లు) ప్లేయర్‌గా శ్రీనగర్‌కు చెందిన షరిక్ యాసిర్ నిలిచాడు. దేశంలోని 55 నగరాల నుంచి దాదాపు 30లక్షలకు పైగా ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 350 మందికి వేలంలో అవవకాశం లభించింది. ఇందులో నుంచి 96 మంది ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ యాజమాన్యంలో ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ పోటీపడుతున్నది. లీగ్‌లో హైదరాబాద్ సహా టైగర్స్ ఆఫ్ కోల్‌కతా, మాజీ ముంబై, కేవీఎన్ బెంగళూరు స్ట్రైకర్స్, చెన్నై సింగమ్స్, శ్రీనగర్ కే వీర్ బరిలో ఉన్నాయి.