హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు రిత్విక్ సంజీవి సతీష్ కుమార్, ఇషారాణి బారువా సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గచ్చిబౌలి లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఈనెల 5 నుంచి 10 వరకు జరిగిన టోర్నీలో భాగంగా పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో రిత్విక్.. 21-11, 21-14తో తెలంగాణకు చెందిన తరుణ్ రెడ్డిని ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
మహిళల సింగిల్స్‌లో భారత యువ సంచలనం ఇషారాణి.. 21-15, 9-21, 21-17తో రక్షిత శ్రీ సంతోష్ రామ్‌రాజ్‌ను ఓడించి టైటిల్ నెగ్గింది. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ కృష్ణమూర్తి-సాయి ప్రతీక్ ద్వయం.. 21-19, 21-17తో అర్జున్-విష్ణువర్ధన్‌ను ఓడించి విజేతలుగా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్స్‌లో ప్రియ-శృతి జోడీ.. 21-18, 21-13తో ఆర్థి సారా సునీల్-వర్షిణి విశ్వనాథ్‌ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్‌లో రోహన్ కపూర్-రిత్విక శివాని జంట 21-17, 21-19తో హరిహరన్-తనీషా క్రాస్టోను చిత్తుచేసి టైటిల్ గెలిచింది.