IPL 2025 : ఐపీఎల్ రికార్డు బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరులో గర్జించింది. 18వ సీజన్ ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటూ అద్భుత విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో టాపార్డర్ విఫలమైనా ఇషాన్ కిషన్(44) చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికేశాడు. అనికేత్ వర్మ(19) రాణించినా.. నూర్ అహ్మద్() తిప్పేయగా సగం వికెట్లు పడ్డాయి. అయినా సరే ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వని కమిందు మెండిస్(30 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి(19 నాటౌట్)లు ధనాధన్ ఆడి హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆడిన 9 మ్యాచుల్లో ఏడింటా ఓడిన సీఎస్కే అనధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్టే.
ఐపీఎల్ 18వ సీజన్లో వరుస ఓటములతో 9వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ చావోరేవో పోరులో చెలరేగింది. పేసర్లు కట్టదిటత్టటంగా బౌలింగ్ చేయడంతో చెపాక్ స్టేడియంలో సూపర్ కింగ్స్‌ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసింది. ఆపై స్వల్ప ఛేదనను 19 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి ఛేదించింది. సన్‌రైజర్స్‌కు సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ పెద్ద షాకిచ్చాడు. రెండో బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మ(0)ను ఔట్ చేశాడు. అభి ఆడిన బంతిని అన్షుల్ కంబోజ్ సులువుగా అందుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ జతగా హెడ్ ధాటిగా ఆడాడు. ఇద్దరూ బౌండరీలతో చెలరేగారు. అయితే.. పవర్ ప్లే ముగుస్తుందనగా హెడ్‌ను బౌల్డ్ చేసి బ్రేకిచ్చాడు.
Third win of the season for SRH 🟠#CSKvSRH LIVE: https://t.co/xTq3bk1jey pic.twitter.com/lfU7AHNFBw
— ESPNcricinfo (@ESPNcricinfo) April 25, 2025
ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్(7) క్రీజులో కుదురుకునేలోపే జడేజా బౌలింగ్‌లో హుడా చేతికి దొరికాడు. అంతే.. 3 వికెట్లు పడ్డాయి. అనికేత్ వర్మ(19).. సామ్ కరణ్ వేసిన 10 ఓవర్లో ఇషాన్ ఫోర్, అనికేత్ సిక్సర్ బాదడంతో స్కోర్ 60 దాటింది. నాలుగో వికెట్‌కు 36 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని నూర్ అహ్మద్ విడదీశాడు. ఇషాన్ ఆడిన బంతిని సామ్ కరన్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ కాసేపటికే అనికేత్‌ను నూర్ ఔట్ చేయగా 13.5 ఓవర్లకు సన్‌రైజర్స్ సగం వికెట్లు కోల్పోయింది. అప్పటికీ విజయానికి 37 బంతుల్లో 49 రన్స్ అవసరం.
ఐదు వికెట్లు పడినా కమిందు మెండిస్(30 నాటౌట్) ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. నూర్ అహ్మద్ వేసిన 16వ ఓవర్లో స్వీప్ షాట్లతో రెండు ఫోర్లు రాబట్టాడు. రెండు నో బాల్స్ కూడా తోడవ్వగా 13 రన్స్ వచ్చాయి. నితీశ్ కుమార్ రెడ్డి(19 నాటౌట్) పథిరన బౌలింగ్‌లో రెండు ఫోర్ బాది జట్టు స్కోర్ 140 దాటించాడు. దాంతో, హైదరాబాద్ విజయానికి చేరువైంది. జడేజా వేసిన 18వ ఓవర్లో మెండిస్ మూడు డబుల్స్ తీసి జట్టుకు 5 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు.
ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరులో పంజా విసిరింది. టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్‌ను బ్యాటింగ్ ఆహ్వానించిన కమిన్స్ సేన పవర్ ప్లేలోనే ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. 47 వద్ద మూడో వికెట్ పడిన సీఎస్కేను తొలి మ్యాచ్ ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్(42), రవీంద్ర జడేజా(21), శివం దూబే(12)లు ఆదుకున్నారు.
Dealing in W’s and 0’s ☝👌
Harshal Patel did what he does best to lead #SRH‘s bowling charge 💪
Watch his superb spell ▶️ https://t.co/dvavX9gv45#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/YhmTXGmXKQ
— IndianPremierLeague (@IPL) April 25, 2025
ధాటిగా ఆడుతున్న జడ్డూను కమింద్ మెండిస్ బౌల్డ్ చేయడంతో సీఎస్కే కోలుకోలేకపోయింది. హర్షల్ పటేల్(4-28) సీఎస్కే మిడిలార్డర్‌ను క్రీజులో నిలువనీయలేదు. బ్రెవిస్ మెరుపులకు ముగింపు పలికిన అతడు.. ధోనీ(6), నూర్ అహ్మద్(2)లను ఔట్ చేసి చెన్నైని ఆలౌట్ అంచున నిలిపాడు. డెత్ ఓవర్లలో దీపక్ హుడా(22) ధనాధన్ ఆడి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. అతడు 20వ ఓవర్ ఐదో బంతికి ఔటవ్వడంతో సీఎస్కే 154 రన్స్‌కు ఆలౌటయ్యింది.