ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లను భారీ వేలానికి కొనుగోలు చేసే విషయం తెలిసిందే. ఒకవేళ పెద్ద ప్లేయర్ అయితే, అతనికి వేలంలో ఎక్కువకు ఖరీదు చేస్తారు. ఇక ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు.. టీ20 ఫార్మాట్లో చాలా క్రేజీ ఉన్నది. అతన్ని సొంతం చేసుకునేందుకు లక్నో సూపర్ గెయింట్స్ జట్టు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 50 కోట్లు ఇచ్చి అయినా.. రోహిత్‌ను ఎగురేసుకుపోవాలని లక్నో ప్రయత్నిస్తున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయింకా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈసారి ముంబై ఇండియన్స్ జట్టు ఎంత మంది ప్లేయర్లను రిటేన్ చేస్తుందో తెలియదు. కానీ రోహిత్ శర్మకు 50 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు లక్నో జట్టు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయింకా మాట్లాడుతూ.. అసలు రోహిత్ శర్మ వేలానికి వెళ్లడం ఎప్పుడైనా చూశారా అని అడిగారు. ఎటువంటి కారణం లేకుండానే వదంతులు వ్యాపిస్తుంటాయన్నారు. ముంబై ఇండియన్స్ అతన్ని రిలీజ్ చేస్తుందో లేదో తెలియదు. అతను వేలానికి వస్తాడో లేదో తెలియదు.
ఒకవేళ రోహిత్ వచ్చినా.. 50 శాతం సాలరీ నిబంధనతో అతన్ని కొనుగోలు చేసినా, మిగితా ఆటగాళ్లను ఎలా మేనేజ్ చేస్తామని గోయింకా ప్రశ్నించారు. బెస్ట్ కెప్టెన్ జట్టులో ఉండాలని ఎవరైనా ఆశిస్తారని, నీ దగ్గర ఏం ఉన్నది, నీకు ఏది అందుబాటులో ఉందన్న విషయాలను గ్రహించాలన్నారు. నాకు అన్ని కావాలన్న ఆలోచన ఉన్నట్లే, మిగితా ఫ్రాంచైజీలకు ఉంటుందని, కానీ నీకు అందరూ చిక్కరని సంజీవ్ గోయింక తెలిపారు.