Rahmat Shah : అఫ్గానిస్థాన్ (Afghanistan) స్టార్ క్రికెటర్ (Star Cricketer) రహ్మత్ షా (Rehmat Shah) చనిపోయినట్లు సోషల్ మీడియా (Social Media) లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 32 ఏళ్ల రహ్మత్ షా మరణించాడంటూ ‘ఎక్స్ (X)’ వేదికగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు తేలింది. అఫ్గాన్ ఆల్రౌండర్ కరీమ్ జనత్ (Karim Janat) ఇన్స్టాగ్రామ్ (Instagram) లో పెట్టిన ఒక పోస్ట్వల్ల ఈ గందరగోళం మొదలైంది. రహ్మత్ షా తల్లి మరణించడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కరీమ్ జనత్.. పష్తో భాషలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు రహ్మత్ షా ఫొటోను జతచేశారు.
ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ఆ పష్తో సందేశాన్ని ఇంగ్లీషులోకి తప్పుగా అనువదించింది. రహ్మత్ షా తల్లి చనిపోయారనే విషయాన్ని మార్చేసి, రహ్మత్ షానే చనిపోయాడంటూ తప్పుడు అర్థం వచ్చేలా చూపించింది. దీంత అభిమానులు కంగారుపడి ఆ వార్తను వైరల్ చేశారు. రహ్మత్ షా గత ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో అఫ్గానిస్థాన్ తరఫున చివరిసారిగా ఆడాడు. ఆ సిరీస్లో గాయం కారణంగా అతడు చివరి మ్యాచ్కు దూరమయ్యాడు. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాడు. కేవలం ఇన్స్టాగ్రామ్ యాప్ చేసిన తప్పుడు అనువాదం వల్లే ఈ ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.