టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు ఈ ట్రోఫీ అందుకున్న ఏకైక జట్టు వెస్టిండీస్. అదే జట్టు ఈసారి కనీసం సూపర్-12 దశ కూడా చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఐర్లాండ్ చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘోరపరాజయం మూటగట్టుకొని, భారంగా స్వదేశం పయనమైంది. ఈ సందర్భంగా వెస్టిండీస్ జట్టు సారధి నికోలస్ పూరన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచామని చెప్పిన పూరన్.. తమ జట్టు సరిగా బ్యాటింగ్ చేయలేదని చెప్పాడు.
‘ఈ టోర్నమెంట్లో మా జట్టు ఏమాత్రం రాణించలేదు. ఒక్క మ్యాచ్‌లో కూడా సరిగా బ్యాటింగ్ చేయలేదు. ఇది నిజంగా చాలా బాధాకరమైన అనుభవం. నేను మా వాళ్లను చాలా నిరాశ పరిచా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రూప్-బిలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో అదరగొట్టిన ఐర్లాండ్.. 17.3 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 150 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు సూపర్-12 దశలోకి అడుగుపెట్టగా.. టోర్నీ నుంచి విండీస్ నిష్క్రమించింది.