లక్నో: ప్రతిష్టాత్మక ఇరానీ కప్లో రంజీ చాంపియన్ ముంబై భారీ ఆధిక్యంతో ఈ మ్యాచ్ను శాసించే స్థితికి చేరింది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పృథ్వీ షా (76) మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. 37 బంతుల్లోనే అతడి అర్థ సెంచరీ పూర్తవడం విశేషం. సర్ఫరాజ్ (9 నాటౌట్), తనుష్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. పృథ్వీ దూకుడుతో ఆ జట్టు 274 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 289/4 వద్ద నాలుగో రోజు ఆట ఆరంభించిన రెస్టాఫ్ ఇండియా (ఆర్వోఐ) 410 పరుగులకు ఆలౌట్ అయింది. అభిమన్యు ఈశ్వరన్ (191) తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకోగా ధ్రువ్ జురెల్ (93) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.