అబుదాబి: ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి (IPL) వేళైంది. మంగళవారం అబుదాబి వేదికగా జరుగబోయే ఈ వేలం (IPL Auction) ప్రక్రియలో పది ఫ్రాంచైజీలు 77 స్లాట్స్ కోసం రూ. 237.55 కోట్లు వెచ్చించనున్నాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఖాతాలో రూ. 64.30 కోట్లు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ పర్స్‌లో రూ. 43.40 కోట్ల నగదు ఉంది. వేలంలో ఈ రెండు జట్ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.

చెన్నై, బెంగళూరుతో పాటు హైదరాబాద్ (రూ. 25.50 కోట్లు), లక్నో (రూ. 22.95 కోట్లు), ఢిల్లీ (రూ. 21.80 కోట్లు), బెంగళూరు (రూ. 16.40 కోట్లు) కూడా కీలక ఆటగాళ్లపై కన్నేశాయి. మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, ఇంగ్లండ్ స్పిన్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టొన్, భారత బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ అత్యధిక ధర పలికే ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

ఐపీఎల్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లకు ఉండే క్రేజే వేరు. గ్రీన్ కూడా ఆ క్యాటగిరీలో ఉన్నవాడే. ఆసీస్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న అతడిని సీఎస్కేతో పాటు కేకేఆర్ టార్గెట్ చేశాయి. కేకేఆర్ ఆండ్రీ రసెల్ రూపంలో నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్‌ను కోల్పోగా చెన్నై కూడా జడేజా సేవలు వదులుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లకూ గ్రీన్ అవసరం ఎంతో ఉంది. ఐపీఎల్ మొదటి సీజన్లో ముంబైకి, ఆ తర్వాత బెంగళూరుకు ఆడిన అతడు.. ఉన్నంతలో మెరుగైన ప్రదర్శనలే చేశాడు. ఇప్పటిదాకా ఐపీఎల్లో అతడు 29 మ్యాచ్‌లాడి 704 రన్స్ చేయడమే గాక 16 వికెట్లు పడగొట్టాడు. నేటివేలంలో అతడు ఆసీస్ ప్రీమియం పేసర్ మిచెల్ స్టార్క్ అత్యధిక ధర (రూ. 24.75 కోట్లు) రికార్డును దాటేస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారం మినీ వేలంలో ఒక విదేశీ ఆటగాడి ఫీజు సదరు ఫ్రాంచైజీ హయ్యస్ట్ రిటెన్షన్ వాల్యూ (రూ. 18 కోట్లు) కంటే మించదు.

గ్రీన్‌తో పాటు నిరుడు బెంగళూరుకు ఆడిన లివింగ్‌స్టొన్ కూడా ఫ్రాంచైజీలకు హాట్‌కేకే. లోయరార్డర్లో తనదైన హిట్టింగ్తో మెరుపులు మెరిపించడమే గాక స్పిన్ వేయగలగడం అతడి ప్రత్యేకత. నిరుడు అతడు రూ. 9 కోట్ల భారీ ధరతో బెంగళూరుకు ఆడినా ఈ సీజన్లో మాత్రం ఆ ఫ్రాంచైజీ అతడిని రిటైన్ చేసుకోలేదు. అలాగే నిరుడు రికార్డు ధర (రూ. 23.75 కోట్లు) పలికి ఈ ఏడాది వేలానికి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ కూడా మంచి ధర పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇటీవలే భారత్‌తో రెండో టీ20లో మెరుపులు మెరిపించిన క్వింటన్ డికాక్, ఇంగ్లిష్ బ్యాటర్ జెమీ స్మిత్, విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, లంక పేసర్ మతీశ పతిరాన వంటివారికి మంచి ధర రావొచ్చు. విదేశీ ఆటగాళ్లతో పాటు ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణిస్తున్న పలువురు ఔత్సాహిక క్రికెటర్లూ ఊహించని ధర దక్కించుకోవచ్చు. వారిలో పేసర్ అకిబ్ నబీ, అశోక్ శర్మ, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ వంటి యువ ఆటగాళ్లున్నారు.