ముంబై : బౌలర్ శ్రీశాంత్‌ను మరో బౌలర్ హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన విషయం గుర్తుందా? 2008లో నిర్వహించిన తొలి ఐపీఎల్లో ఈ ఘటన జరిగింది. ఐపీఎల్ చరిత్రలో ఇదో మరుపురాని చేదు ఘటన. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న స్పిన్నర్ హర్భజన్ సింగ్.. మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబీ బౌలర్ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటన జరిగిన 18 ఏళ్లు అవుతోంది. ఇద్దరు ప్లేయర్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసిన ఆ ఘటనకు చెందిన ఒరిజినల్ వీడియోను లలిత్ మోదీ(Lalit Modi) రిలీజ్ చేశారు. అప్పట్లో ఐపీఎల్ చైర్మెన్‌గా లలిత్ మోదీ వ్యవహరించిన విషయం తెలిసిందే.
Lalit Modi released an unseen video of Bhajji–Sreesanth slapgate. pic.twitter.com/nH5vhpLyAe
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 29, 2025
బియాండ్23 క్రికెట్ పోడ్కాస్ట్ తరపున ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఆ చెంపదెబ్బ ఘటన గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ నాటి ఘటనకు చెందిన వీడియోను షేర్ చేశారు. వాస్తవానికి ఈ ఘటన జరిగినట్లు అందరికీ తెలిసినా, దానికి సంబంధించిన వీడియో ఫూటేజ్ మాత్రం ఎవరికీ అందుబాటులో లేదు. కేవలం లలిత్ మోదీ వద్ద మాత్రమే ఆ ఫూటేజ్ ఉంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కెమెరాలు అన్నీ ఆఫ్ అయ్యాయని, కానీ తన సెక్యూర్టీ కెమెరా ఆన్‌లో ఉండడం వల్ల ఆ ఘటన చిక్కినట్లు లలిత్ మోదీ తెలిపారు. 18 ఏళ్లుగా ఈ వీడియోను దాచిపెట్టినట్లు ఆయన చెప్పారు.
శ్రీశాంత్‌ను కొట్టిన అంశంపై ఇటీవల భజ్జీ క్షమాపణలు చెప్పారు. నిజానికి అనేక సందర్భాల్లో ఆ ఘటనను గుర్తు చేస్తూ అతను సారీ చెప్పాడు. ఒకవేళ తనకు అవకాశం వస్తే, తన కెరీర్ జ్ఞాపకాల నుంచి ఆ ఘటనను తొలగించనున్నట్లు హర్భజన్ పేర్కొన్నాడు. బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో మార్చాలనుకుంటున్న ఘటన అదొక్కటే అని, శ్రీశాంత్‌తో జరిగిన ఘర్షణను తొలగించాలనుకుంటున్నట్లు చెప్పాడు. అలా చేసి ఉండాల్సింది కాదు అని, కానీ ఇప్పటికే 200 సార్లు క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. తనకు దొరికిన ప్రతి సందర్భంలోనూ సారీ చెప్పినట్లు వెల్లడించాడు. నిజానికి అది తన పొరపాటే అని అన్నారు.
ఆ ఘటన జరిగిన చాన్నాళ్ల తర్వాత కూడా అది తనను బాధించినట్లు చెప్పాడు. శ్రీశాంత్ కూతుర్ని కలిసిన సందర్భంలో ఆమెతో ప్రేమగా మాట్లాడుతుంటే, ఆ అమ్మాయి తనతో మాట్లాడేందుకు ఇష్టంగా లేనట్లు చెప్పిందన్నాడు. నువ్వు మా నాన్నను కొట్టావని పేర్కొన్నదన్నాడు. ఆ చిన్నారి మాటలు తనను గుండెను లాగేశాయని, తన కండ్లల్లో నీళ్లు తిరిగినట్లు భజ్జీ చెప్పాడు. బహుశా ఆ చిన్నారి తన గురించి తప్పుగా భావిస్తుందేమో అని అన్నాడు. నాన్నను కొట్టిన వ్యక్తిలా తనను చూస్తోందని, అందుకే అతని కూతురికి క్షమాపణలు చెప్పినట్లు భజ్జీ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.