IPL auction : ఐపీఎల్ 2025 కోసం ఆదివారం మొదలైన ఆటగాళ్ల వేలం రెండో రోజైన సోమవారం కూడా కొనసాగుతోంది. ఇవాళ్టి వేలంలో ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్ భారీ ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ జట్టు జాన్సెన్ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కృనాల్ పాండ్యా కూడా భారీ ధరకు అమ్ముడుపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆయనను రూ.5.75 కోట్లకు దక్కించుకుంది.
అదేవిధంగా భారత్‌కు చెందిన యువ ఆటగాడు నితీష్ రానాను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది. మరో ఇండియన్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. సామ్ కరన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.2.40 కోట్లకు కొన్నది. మరో స్టార్ ప్లేయర్ ఫాఫ్ డూప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. యువ ఆటగాడు రోవ్‌మన్ పావెల్‌ను కేకేఆర్ టీమ్ రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.
కేన్ మామగా ప్రసిద్ధి చెందిన కేన్ విలియమ్సన్‌ను వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. అదేవిధంగా భారత్‌కు చెందిన అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలకు కూడా ఊహించని షాక్ తగిలింది. పది ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా వారిని కొనేందుకు ముందుకు రాలేదు.
ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్రాంచైజీ లీగ్ అయిన ఐపీఎల్లో ఆడేందుకు మొత్తం 1574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితాలో 574 మందికి చోటు దక్కింది. చివరి నిమిషంలో ముగ్గురిని చేర్చారు. తొలిరోజు 84 మంది వేలానికి వచ్చారు. డేవిడ్ వార్నర్ అమ్ముడుపోకపోవడం తొలి రోజు వేలంలో ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. రెండో రోజు కూడా మరిన్ని షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.