IPL Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం నేపథ్యంలో ఈసారి అత్యధిక ధర దక్కించుకోబోయే క్రికెటర్ ఎవరు..? అన్న చర్చ జోరుగా సాగుతున్నది. ఐపీఎల్ విలువ ఇటీవలే 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 85 వేల కోట్లు) చేరినా గడిచిన 16 సీజన్లుగా జరుగుతున్న వేలం ప్రక్రియలలో ఇప్పటివరకూ ఒక్క క్రికెటర్ కూడా రూ. 20 కోట్ల మార్కును అందుకోలేదు. గత సీజన్లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ఆ విలువకు దగ్గరగా వచ్చాడు. అసలు ఇప్పటివరకూ ఐపీఎల్లో సీజన్ల వారీగా అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్ ఎవరు..? రేపటి వేలంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్రికెటర్ ఎవరు కానున్నారు..? అన్న వివరాలు మీకోసం..
2008లో మొదలైన ఐపీఎల్లో తొలి సీజన్లో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని రూ. 9.5 కోట్లతో దక్కించుకుంది. ఆ తర్వాత సీజన్లలో వరుసగా..
– 2009 : కెవిన్ పీటర్సన్ (ఆర్సీబీ), ఆండ్రూ ఫ్లింటాఫ్ – రూ. 9.8 కోట్లు
– 2010 : షేన్ బాండ్ (కేకేఆర్), కీరన్ పొలార్డ్ (ముంబై) – రూ. 4.8 కోట్లు
– 2011 : గౌతమ్ గంభీర్ (కేకేఆర్) – రూ. 14.9 కోట్లు
– 2012 : రవీంద్ర జడేజా (చెన్నై) – రూ. 12.8 కోట్లు
– 2013 : గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ముంబై) – రూ. 6.3 కోట్లు
– 2014 : యువరాజ్ సింగ్ (ఆర్సీబీ) – రూ. 14 కోట్లు
– 2015 : యువరాజ్ సింగ్ (ఢిల్లీ) – రూ. 16 కోట్లు
– 2016 : షేన్ వాట్సన్ (ఆర్సీబీ) – రూ. 9.5 కోట్లు
– 2017 : బెన్ స్టోక్స్ (పూణె) – రూ. 14.5 కోట్లు
– 2018 : బెన్ స్టోక్స్ (రాజస్తాన్) – రూ. 12.5 కోట్లు
– 2019 : జయదేవ్ ఉనద్కత్ (రాజస్తాన్), వరుణ్ చక్రవర్తి (పంజాబ్) – రూ. 8.4 కోట్లు
– 2020 : పాట్ కమిన్స్ (కేకేఆర్) – రూ. 15.5 కోట్లు
– 2021 : క్రిస్ మోరిస్ (రాజస్తాన్) – రూ. 16.25 కోట్లు
– 2022 : ఇషాన్ కిషన్ (ముంబై) – రూ. 15.25 కోట్లు
– 2023 : సామ్ కరన్ (పంజాబ్) – రూ. 18.50 కోట్లు
ఇప్పుడెవరు..?
మంగళవారం జరుగబోయే ఐపీఎల్ – 2024 వేలంలో పలువురు విదేశీ క్రికెటర్లకు భారీ ధర పలికే అవకాశముంది. దాదాపు అన్ని జట్లూ బౌలర్ల కోసం చూస్తున్న నేపథ్యంలో ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌తో పాటు సఫారీ బౌలర్ గెరాల్డ్ కొయెట్జ్ లు జాబితాలో ముందున్నారు. ఫ్రాంచైజీలు ఈ పేసర్లకు ఏ మేరకు ఖర్చు చేస్తాయో చూడాలి. బ్యాటర్లపరంగా చూస్తే ట్రావిస్ హెడ్, రిలీ రూసోలు జాక్‌పాట్ కొట్టే అవకాశం లేకపోలేదు. కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తొలిసారే కోటీశ్వరుడు అవడం పక్కా అన్న వాదనలున్నాయి. భారత్ నుంచి శార్దూల్ ఠాకూర్ పేరు కూడా వినపడుతున్నా గత రెండు సీజన్లలో అతడు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో అతడిపై ఫ్రాంచైజీలు అంత ఆసక్తి చూపుతాయా..? అన్నది అనుమానమే. పంజాబ్ కింగ్స్ ఇటీవలే వేలానికి వదిలేసిన షారుక్ ఖాన్ కూడా భారీ ధర పలికే అవకాశాలున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.