చెన్నై: ఐపీఎల్ -2026 సీజన్ ఆరంభానికి మరో ఏడు నెలల సమయమున్నప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ట్రేడ్ విండో’తో పలు జట్లు తదుపరి వేలానికి ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదులుకోవాలి? ఎవరిని ఇతర జట్లతో ట్రేడ్ చేసుకోవాలి? అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్, చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాము జట్లను వీడుతామని ఆయా ఫ్రాంచైజీలకు తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. తొమ్మిది సీజన్ల తర్వాత నిరుడు చెన్నైకి తిరిగొచ్చిన అశ్విన్.. తనను రిటైన్ చేసుకోవద్దని ఫ్రాంచైజీకి చెప్పినట్టు సీఎస్కే వర్గాలు తెలిపాయి.
గతేడాది అతడు సీఎస్కేకు రాగానే ఆ జట్టు అశ్విన్‌కు సీఎస్కే అకాడమీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ బాధ్యతలనూ అప్పగించింది. కాగా గత సీజన్లో అశ్విన్‌ను రూ. 9.75 కోట్లకు దక్కించుకున్న సీఎస్కే.. అతడిని పెద్దగా ఆడించలేదు. వ్యక్తిగతంగా అశ్విన్ కూడా మునపటి స్థాయిలో రాణించలేదు. నిరుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై పలికిన అశ్విన్.. మళ్లీ వేలానికి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే సీఎస్కే నుంచి అశ్విన్ ప్రతిపాదనపై ఎలాంటి సమాధానమూ రాలేదని వినికిడి. ప్రస్తుతం ఆ జట్టు తాజా, మాజీ సారథులు (రుతురాజ్, ధోనీ) చెన్నైలోనే ఉన్నారు. రాబోయే సీజన్ కోసం వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఆటగాళ్ల లభ్యతపై ఈ ఇద్దరూ చెన్నై యాజమన్యంతో చర్చలు జరుపనున్నట్టు తెలుస్తున్నది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ సారథి శాంసన్ సైతం తనను వదిలేయాలని ఆ జట్టు యాజమన్యాన్ని కోరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత సీజన్లోనే రాయల్స్ మేనేజ్మెంట్తో శాంసన్‌కు పొసగడం లేదన్న వార్తలు వచ్చాయి. ఆ జట్టు మాజీ ఓపెనర్ జోస్ బట్లర్‌ను వేలానికి వదిలేసి మళ్లీ దక్కించుకోకపోవడం, అతడు గాయం నుంచి కోలుకున్నా రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పడంపై శాంసన్ నొచ్చుకున్నట్టు వార్తలొచ్చాయి.
దీనికి కొనసాగింపా? అన్నట్టుగా తాజాగా అతడు.. జట్టు నుంచి వెళ్లిపోతానని రాయల్స్ యజమన్యానికి చెప్పినట్టు తెలుస్తున్నది. సుదీర్ఘకాలంగా రాజస్థాన్‌కు ఆడుతున్న శాంసన్‌ను ట్రేడ్ ద్వారా దక్కించుకోవాలని చెన్నై భావించినా ప్రస్తుతానికి వారికి అలాంటి ఆసక్తేమీ లేదని సమాచారం. శాంసన్ వేలానికి వస్తే అతడిని దక్కించుకోవడానికి సీఎస్కే, కేకేఆర్ పోటీపడుతున్నాయి. ధోనీ వారసుడిగా కీపర్, బ్యాటర్ కమ్ కెప్టెన్‌గా శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలన్న యోచనలో సీఎస్కే ఉంది.