IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాబోయే సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును కెప్టెన్‌గా నడిపించాలని ఉందని ఆ జట్టు ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోరికను వ్యక్తం చేశాడు. తనకు కెప్టెన్‌గా అనుభవం లేదని.. అయినా జట్టును నడిపించే అవకాశం వస్తే అందుకు సిద్ధంగా ఉంటానని తెలిపాడు. ఐపీఎల్ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు జట్టును ఢీకొట్టనున్నది. అయితే, కేకేఆర్ జట్టుకు కెప్టెన్ లేడు. ఇప్పటి వరకు ఎవరికి జట్టు పగ్గాలు అప్పగిస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు. శ్రేయాస్ అయ్యర్ గత సీజన్లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అయ్యర్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు అయ్యర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కెప్టెన్సీపై వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. జట్టు పగ్గాలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. తాను ఎప్పుడూ ఇదే చెబుతున్నానని.. కెప్టెన్సీ అనేది ఒక ట్యాగ్ మాత్రమేనన్నారు. నాయకత్వంపై నమ్మకం ఉంచుతానని.. కెప్టెన్సీ అనేది పెద్ద రోల్ అని పేర్కొన్నారు. దానిపై ఎలాంటి అస్పష్టత లేదనని చెప్పాడు. తనకు అవకాశం వస్తే.. ఖచ్చితంగా చేస్తానని.. చేయకపోవడానికి ఎలాంటి కారణం లేదని తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ కెప్టెన్ మంచి రోల్ మోడల్‌గా నిలువాలని వెంకటేశ్ పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో నాయకుడిగా ఉండేందుకు కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదని.. ఒక ఉదాహరణగా ఉండాలని చెప్పాడు.
ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్‌లో ఉన్నానని.. మైదానంలో, బయట మంచి రోల్ మోడల్‌గా ఉండానని.. తాను మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌ని కాదని.. కానీ, నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని చెప్పాడు. ఎవరైనా అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండే వాతావరణంలో జీవించడం తనకు ఇష్టమని చెప్పారు. అందరికీ అభిప్రాయాలు, సూచనలు ఇచ్చే స్వేచ్ఛ ఉండాలని.. వాటిని సరైన స్ఫూర్తితో తీసుకోవాలని చెప్పాడు. ఇదిలా ఉండగా.. కేకేఆర్ జట్టు 2021లో కేకేఆర్‌లో చేరిన వెంకటేశ్ అయ్యర్‌ను గతేడాది వేలానికి ముందు రిలీజ్ చేసింది. కానీ, ఆర్సీబీతో వేలంలో పోటీపడి రూ.23.75కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. అయ్యర్ 51 ఐపీఎల్ మ్యాచుల్లో 1,326 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లను కేకేఆర్ తరఫునే ఆడాడు.