IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ కొనసాగుతున్నది. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతుండగా.. ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పలువురు బ్యాటర్లు లాంగ్ సిక్సర్లు బాదుతుండడంతో ఆన్ ఫీల్డ్ అంపైర్లు సంప్రదాయాన్ని పక్కనపెట్టి బ్యాట్స్‌మెన్ వాడుతున్న బ్యాట్ల సైజులను కొలువడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బ్యాట్స్‌మెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందకుండా అంపైర్లు బ్యాట్స్ని తనిఖీ చేస్తున్నారు.
బ్యాట్స్ని తనిఖీ చేయడం అందరికీ తెలిసిందే. కానీ, గత సీజన్ వరకు డ్రెస్సింగ్ రూమ్ వరకు మాత్రమే పరిమితమైంది. కానీ, ఐపీఎల్లో బ్యాట్స్‌మెన్స్ భారీ సిక్సర్లను కొడుతున్న నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకుంది. లైవ్ మ్యాచ్ సమయంలో బ్యాట్స్‌మెన్ బ్యాట్లను తనిఖీ చేసే హక్కును బోర్డు ఆన్-ఫీల్డ్ అంపైర్లకు ఇచ్చింది. మ్యాచ్ సమయంలో బ్యాట్స్‌మెన్ బ్యాట్ నిర్దేశించిన పరిమాణం కంటే మందంగా ఉందని అంపైర్లు భావిస్తే.. వారు మ్యాచ్ మధ్యలో అతని బ్యాట్‌ను తనిఖీ చేసేందుకు అవకాశం కల్పించింది.
100 కంటే ఎక్కువ ఐపీఎల్ మ్యాచుల్లో అంపైర్‌గా పని చేసిన ఓ మాజీ అంపైర్ మాట్లాడుతూ.. అంపైర్ల వద్ద నిర్దేశించిన సైజు బ్యాట్ గేజ్‌ను ఉంచుకుంటారని తెలిపారు. బ్యాట్ ఈ గేజ్ గుండా వెళితే.. ఎలాంటి సమస్య ఉండదు. బ్యాట్ దానికుండా వెళ్లకపోతే బ్యాట్ బ్లేడ్ నిర్దేశించిన దాని కంటే ఎక్కువ వెడెల్పు ఉందని అర్థం రూల్ ప్రకారం బ్యాట్ మధ్య భాగం 2.64 అంగుళాల కంటే ఎక్కువ వెడెల్పు ఉండకూడదు. ఈ నెల 13న ముంబయి-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సమయంలో అంపైర్లు హార్దిక్ పాండ్యా బ్యాట్‌ని తనిఖీ చేశారు.
అంతకు ముందు ఫిల్ సాల్ట్, షిమ్రాన్ హెట్మెయిర్ బ్యాట్లను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా వారి బ్యాట్స్ నిర్దేశించిన పరిమితిలో ఉన్నట్లు తేలింది. అయితే, ఏ బ్యాట్స్‌మన్ వాడుతున్న బ్యాట్ నిర్దేశించిన పరిమితి కంటే వెడల్పుగా ఉన్నట్లు తేలిందా? అందుకే మైదానంలో ఆన్ ఫీల్డ్ అంపైర్లతో బ్యాట్స్ని తనిఖీ చేయిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీసీసీఐ స్పందించలేదు.