IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025కి ముందు మెగావేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగనున్నది. యువ క్రికెటర్లతోపాటు సీనియర్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. ఐపీఎల్ యువ ఆటగాళ్లకు కీలకంగా మారనున్నది. ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే జాతీయ జట్టులో ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించి.. జాతీయ జట్టులో చోటు సాధించారు. ఈ సారి వేలం పూల్‌లో 318 మంది అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్, 12 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ సహా మొత్తం 574 మంది ఆటగాళ్లు ఉన్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలం యువ క్రికెటర్లకు కీలకం కానున్నది. 204 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తీసుకోనుండగా.. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించనున్నది. ఇప్పటి వరకు జరిగిన లీగ్ వేలం చరిత్రలో అత్యంత పిన్న వయస్కుల ఆటగాళ్ల గురించి ఓసారి తెలుసుకుందాం..!
ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్. 2048లో 16 సంవత్సరాల 296 రోజుల వయసులో ఐపీఎల్ వేలంలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. షార్ట్‌లిస్ట్ అయిన తర్వాత అతన్ని పంజాబ్ కింగ్స్ (అప్పటి పంజాబ్ కింగ్స్ ) రూ.4 కోట్లకు తీసుకుంది. అదే సంవత్సరంలో అతను 11 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. అదే ఏడాది భారత్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మరో మైలురాయిని సాధించాడు. తర్వాతి రెండుసీజన్లలో పంజాబ్ ఫ్రాంచైజీ అతన్ని కొనసాగించింది. కానీ, ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడు వికెట్లతో నిరాశపరిచాడు. ఆ తర్వాత అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. ఆడిన ఒక్క మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సారి మరోసారి వేలంలోకి రానున్నాడు.
బెంగాల్‌కు చెందిన ప్రయాస్ రే బర్మాన్ 2019 ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 16 సంవత్సరాల 54 రోజుల వయస్సులో ఐపీఎల్లో కాంట్రాక్ట్ సంపాదించిన అతి పిన్న వయసుగల ఆటగాళ్లలో ఒకడు. మార్చి 31, 2019న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో నాలుగు ఓవర్లు వేసినా వికెట్ల పడగొట్టలేకపోయాడు. బ్యాట్‌తో 19 పరుగులు చేసినా ఆ తర్వాత మ్యాచ్‌లలో అవకాశం దక్కలేదు. అతను ఆడిన ఏకైక ఐపీఎల్ మ్యాచ్ ఇదే. దురదృష్టవశాత్తు 2020 సీజన్‌కు ముందు ఆర్సీబీ విడుదల చేసింది. అప్పటి నుంచి ఐపీఎల్లో మళ్లీ కనిపించలేదు. బెంగాల్ జట్టు తరఫున ఆడినా పెద్దగా రాణించలేకపోయాడు.
అల్లా గజన్ఫర్ ఆఫ్ఘన్ ఆటగాడు. ఐపీఎల్ 2023లో ఎంట్రీ ఇచ్చాడు. కేవలం 15 ఏళ్ల 161 రోజుల వయస్సులో ఐపీఎల్ వేలంలోకి ప్రవేశించి వార్తల్లో నిలిచాడు. అయితే, అతను అప్పట్లో అమ్ముడవలేదు. 2024లో ముజీబ్ ఉర్ రెహమాన్ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరగా.. అదృష్టం మారింది. ముంబయి ఇండియన్స్ (MI) గత సీజన్‌కు ముందు అతన్ని నెట్‌బౌలర్‌గా తీసుకుంది. అయితే, వీసా కారణాలతో రాలేకపోయాడు. ఇటీవల షార్జాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ బౌలర్ స్పెల్‌లో బంగ్లాదేశ్ కేవలం 11 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఇప్పటికే ఎనిమిది వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన గజన్ఫర్ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు.
బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల 242 రోజుల వయసులో ఐపీఎల్ వేలానికి అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అన్క్యాప్డ్ బ్యాట్స్‌మన్ విభాగంలో (UBA9) 491వ స్థానంలో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఉన్నాడు. చిన్న వయస్సులోనే బ్యాట్‌తో గొప్ప ప్రదర్శన చేశాడు. జనవరి 2024లో బీహార్ తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన తర్వాత.. సెప్టెంబర్ ఇండియా U19 Vs ఆస్ట్రేలియా U19 యూత్ టెస్ట్ సిరీస్‌లో సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సూర్యవంశీ రాబోయే అండర్-19 ఆసియా కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో మరింత రాణిస్తే ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడే అవకాశాలున్నాయి.